రంగనాథుడి ఆచూకీ చెప్పిన రామచిలుక !

తమిళనాట ఆవిర్భవించిన అత్యంత సుందరమైన ... విశిష్టమైన దివ్యక్షేత్రాలలో 'శ్రీరంగం' ఒకటి. పరమపవిత్రమైన ఈ క్షేత్రంలో అడుగుపెట్టగానే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. సువిశాలమైన విస్తీర్ణం కలిగిన ఈ ప్రదేశం కేవలం క్షేత్రంగానే కాకుండా, అనంతుడిగా చెప్పబడుతోన్న స్వామివారి అంతఃపురంలా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడే ప్రాచీనకాలంనాటి రంగనాథస్వామి ప్రతిమ కనిపిస్తుంది. చిన్మయ మూర్తిగా కనిపించే ఈ స్వామి ప్రతిమను స్వయంగా బ్రహ్మదేవుడే రూపొందించాడని అంటారు.

అంతటి విశిష్టత కలిగిన ఈ విగ్రహం కాలక్రమంలో ఒక భక్తుడికి లభించిందట. ఆ రోజు నుంచి ఆ భక్తుడు స్వామివారి ప్రతిమను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండేవాడు. అనేక కీర్తనలతో స్వామివారిని అనునిత్యం అభిషేకిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు అతను ఆ విధంగా పాడుతూ ఉండటాన్ని ఓ రామచిలుక వింటూ ఉండేదట. ఇలా కొంతకాలం గడిచే సరికి అది ఆ కీర్తనల్లోని కొన్ని పంక్తులను నేర్చుకోగలిగింది.

అలాంటి పరిస్థితుల్లో వచ్చిన వరదల కారణంగా ఆ విగ్రహం ఇసుకలో కూరుకుపోయింది. అయినా ఆ చిలుక అనుదినం అక్కడికి వచ్చి తాను నేర్చుకున్న నాలుగు పంక్తులను పాడి వెళుతూ ఉండేదట. ఒకసారి ఆ చిలుక అలా పాడుతూ ఉండటాన్ని చోళన్ వంశానికి చెందిన ప్రభువు ధర్మవర్మ చూస్తాడు. ఆ చిలుక పలుకలను బట్టి ఆ ప్రదేశంలో రంగనాథస్వామికి సంబంధించిన విశేషమేదో దాగి ఉందనే విషయం ఆయనకి అర్థమవుతుంది.

ఆ ప్రదేశంలో ఆయన అన్వేషణ కొనసాగించగా ఇసుకలో కూరుకుపోయిన స్వామివారి విగ్రహం బయటపడుతుంది. అలా రంగనాథుడి ఆచూకీని రామచిలుక తెలియజేసి, స్వామివారు నిత్యనీరాజనాలు అందుకోవడానికి తన వంతు కృషి చేయడాన్ని భక్తులు మహిమాన్వితమైన సంఘటనగా భావిస్తూ ఉంటారు ... అందరూ కలిసి ఆసక్తికరంగా చెప్పుకుంటూ ఉంటారు.


More Bhakti News