బల్లి గురించి బాబా చెప్పింది పొల్లుపోలేదు !

ఒక రోజున శిరిడీలోగల మశీదులో బాబా తన సహచరులతో కలిసి కబుర్లు చెబుతూ కూర్చుంటాడు. ఆ సమయంలో ఆయన దర్శనం కోసం వచ్చిన కొంతమంది భక్తులు కూడా అక్కడే ఉంటారు. అదే సమయంలో మశీదు గోడపై పాకుతూ ఒక బల్లి అరుస్తుంది. దాంతో అందరి దృష్టి ఆ బల్లిపైకి వెళుతుంది. బాబా దర్శనం కోసం వచ్చిన ఒక భక్తుడు, ఆ బల్లి అలా చిత్రమైన ధ్వని చేయడంలో గల అర్థమేమిటో చెప్పవలసిందిగా బాబాను కోరతాడు.

దాంతో బాబా ఏం చెబుతాడో అన్నట్టుగా అంతా ఆసక్తిగా చూస్తుంటారు. ఔరంగాబాద్ నుంచి రానున్న తన చెల్లెలి కోసం ఆ బల్లి ఆత్రంగా ఎదురుచూస్తోందనీ, మరి కాసేపట్లో దాని చెల్లెలు రానుందని చెబుతాడు బాబా. చాలాకాలం తరువాత తన చెల్లెలిని చూడబోతున్నాననే సంతోషంతో ఆ బల్లి అలా అరుస్తుందని చెబుతాడు. ఆ మాటలు విన్న వాళ్లంతా ... అడిగిన వ్యక్తిని ఆటపట్టించడం కోసం బాబా అలా చెప్పాడని నవ్వుకుంటారు.

అదే సమయంలో ఓ గుర్రపు బండి మశీదుకు దగ్గరగా వచ్చి ఆగుతుంది. దాంతో అందరి దృష్టి ఆ బండి మీదకి మళ్లుతుంది. ఆ దారిన వెళుతోన్న ఆ గుర్రపు బండి అతను, గుర్రానికి ఆహారాన్ని అందించడం కోసం బండి ఆపాడనే విషయం వాళ్లకి అర్థమైపోతుంది. బండిలో నుంచి ఆ వ్యక్తి ఉలవల బస్తా దింపుతూ ఉండగా, ఆ బస్తాపై గల ఓ బల్లి అక్కడి నుంచి కింద పడుతుంది. ఆ వెంటనే అది చరచరా పాకుతూ మశీదు గోడపైకి చేరుకుంటుంది. కొత్తగా వచ్చిన ఆ బల్లి దగ్గరికి ... పాతబల్లి పాకుతూ వస్తుంది. ఈ దృశ్యం చూసిన వాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు.

అంతకు ముందే బాబా ఏదైతే చెప్పాడో అది తమ కళ్ల ముందే జరగడంతో నివ్వెరపోతారు. చూడటానికి చాలా చిన్న విషయంగా కనిపించేదే అయినా, అది కూడా బాబాకు ముందే తెలిసిపోతుందనే సంగతి వాళ్లకి అర్థమైపోతుంది. దైవ స్వరూపుడైన బాబాను ప్రత్యక్షంగా దర్శించుకోవడం ఒక భాగ్యమైతే, ఆయన సన్నిధిలో కూర్చుని అద్భుతమైన లీలను కూడా దర్శించడం తమ అదృష్టంగా భావిస్తారు. సాయిని సర్వాంతర్యామిగా విశ్వసిస్తూ భక్తి శ్రద్ధలతో ఆయన పాదాలకు నమస్కరిస్తారు.


More Bhakti News