పాపనాశన ద్వాదశి ప్రత్యేకత

నిప్పు తెలిసి తాకినా తెలియక తాకినా కాలి తీరుతుంది. అలాగే పాపమనేది తెలిసి చేసినా తెలియక చేసినా దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు. కొంతమంది తాము ఏ పాపం చేయలేదని అంటూ ఉంటారు. అంటే గుర్తుంచుకోదగిన పెద్ద పాపాలు చేయలేదనో ... చేసిన వాటిని పాపాలుగా ఒప్పుకోకపోవడమో జరిగి ఉంటుందని గ్రహించాలి.

నిత్య జీవితంలో నిర్వర్తించే కార్యక్రమాల కారణంగా కూడా కొన్ని పాపాలు జరిగిపోతుంటాయి. మనకి తెలియకుండానే అవి మన ఖాతాలోకి చేరిపోతుంటాయి. ఇలాంటి పాపాల బారినుంచి బయటపడటానికి కొంతమంది వివిధ క్షేత్రాలను దర్శిస్తుంటారు. మరికొందరు నోములు - వ్రతాలు వంటివి నిర్వహిస్తుంటారు. ఇక ఈ నోములు వ్రతాలలో కూడా ఒక్కో పుణ్య ఫలాన్ని ఆశించి ఒక్కొక్కటి చెప్పబడుతున్నాయి.

అలాంటి వాటిలో సమస్త పాపాలను కడిగేసే వ్రతంగా 'పాపనాశన ద్వాదశి వ్రతం' కనిపిస్తుంది. ఫాల్గుణ శుద్ధ ద్వాదశి రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఉదయం నుంచి ఉపవాస దీక్షను చేపట్టి, ఉసిరిచెట్టు కింద పరశురాముడి చిత్ర పటాన్ని ఉంచి అలంకరించాలి. ఆ తరువాత పరశురాముడి ప్రతిమకు పంచామృతాలతో అభిషేకం జరపాలి.

షోడశ ఉపచారాలను అంకితభావంతో పూర్తి చేసి ఉసిరిచెట్టు మొదట్లో నీరు పోసి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేయాలి. స్తోమతకి తగినట్టుగా బ్రాహ్మణులని భోజనానికి పిలుచుకోవాలి. వాళ్లకి దక్షిణ తాంబూలాలు ఇచ్చి పంపిన తరువాత ఉద్యాపన చెప్పుకోవాలి. ఈ నియమాలని పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించడం వలన పాపాలన్నీ పటాపంచలవుతాయనీ, పుణ్యఫలాల కారణంగా ఉన్నతమైన జీవితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.


More Bhakti News