ధైర్యలక్ష్మీ నోము

స్త్రీల మనోభీష్టాలను నెరవేర్చే నోములలో 'ధైర్యలక్ష్మీ నోము'ఒకటి. ఈ నోమును మంచి ప్రదేశంలో ఉన్న 'జువ్విచెట్టు'ను చూసుకుని మొదలు పెట్టాలి. ఉదయమే తల స్నానం చేసి ... పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి జువ్విచెట్టు దగ్గరికి చేరుకోవాలి. పసుపు కుంకుమలతో జువ్వి చెట్టును అలంకరించి ... పూజించాలి. ఆ తరువాత ఏదో ఒక తీపి పదార్ధం నైవేద్యంగా సమర్పించి 108 ప్రదక్షిణలు చేయాలి. ఇలా ఏడాది పాటు చేసిన మీదట ఉద్యాపన చెప్పుకోవాలసి వుంటుంది.

'దశమి' రోజున జువ్విచెట్టు దగ్గర తొమ్మిది దీపాలు వెలిగించి, 365 ప్రదక్షిణలు చేయాలి. వడపప్పు ... పానకం నైవేద్యంగా సమర్పించి, తొమ్మిది మంది ముత్తయిదువులకు దక్షిణ తాంబూలాలతో కూడిన వాయనమివ్వాలి. దాంతో ఉద్యాపన ప్రక్రియ పూర్తి అవుతుంది.

ఇక ఈ నోముకి సంబంధించిన కథలోకి వెళితే ... ఒక ఊళ్లో శ్యామలాంగి దంపతులు నివసించేవారు. వారిది మధ్యతరగతి కుటుంబం. శ్యామలాంగి పుట్టింటివారు శ్రీమంతులు ... ఆమెకి అయిదుగురు తమ్ముళ్లు. పుట్టింటికి వెళ్లక చాలాకాలం కావడంతో, శ్యామలాంగికి ఆ వైపు మనసు లాగసాగింది. అదే సమయంలో పెద్ద తమ్ముడికి పెళ్లి కుదిరిందంటూ వర్తమానం రావడంతో ఆమె ఆనందంతో పొంగిపోయింది. పుట్టింటివాళ్లను చూడబోతున్నందుకు ... ఆడపడచుగా తనకి రాబోయే కట్నకానుకలు అందుకోబోతున్నందుకు ఆమె ఎంతో సంతోషపడింది.

అయితే సరిగ్గా పెళ్లికి బయలుదేరుతుండగా, ఆమె భర్త అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో ఆమె ఆ పెళ్ళికి వెళ్ళలేక పోయింది. మిగతా ముగ్గురు తమ్ముళ్ల పెళ్లిళ్ల విషయంలోనూ ఇలాగే జరగడంతో ఆమె తీవ్రమైన నిరాశా నిస్పృహలకు లోనైంది. చిన్న తమ్ముడి పెళ్లికి కూడా ఆమె భర్త అనారోగ్యానికి గురయ్యాడు. కానీ ఈసారి ఎలాగైనా పెళ్ళికి వెళ్లాలని నిర్ణయించుకుంది.

భర్తను ఇంట్లోనే వుంచి తాను పెళ్ళికి బయలుదేరింది. కానీ ఆమె మనసు మాత్రం వెనక్కి లాగుతూనే వుంది. అదే సమయంలో ఆమెకి దారి పక్కనే ఓ జువ్విచెట్టు కనిపించింది. ఆ చెట్టును 'ధైర్య లక్ష్మి'గా భావించి, తాను తిరిగి వచ్చేలోగా తనభర్త పూర్తిగా కోలుకోవాలంటూ ప్రార్ధించింది. అదే జరిగితే ధైర్యలక్ష్మీ నోము పడతానని మొక్కుకుంది.

భారం ఆమె పైనే వేసి పుట్టింటికి వెళ్లి ఆడపడచుగా తన పనులను చక్కబెట్టింది. పుట్టింటివారు భారీగా ఇచ్చిన కట్నకానుకలు తీసుకుని తన ఇంటికి చేరుకుంది. భర్త అనారోగ్యం నుంచి కోలుకుని ఆనందంగా ఎదురు రావడం చూసి ఆమె సంతోషంతో పొంగిపోయింది. అందుకు గల కారణాన్ని గ్రహించి వెంటనే ఆమె ధైర్య లక్ష్మీ నోము పట్టి, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆమె దానిని పూర్తి చేసింది.


More Bhakti News