ఆమలక ఏకాదశి విశిష్టత

శ్రీమహావిష్ణువు స్థితి కారకుడు ... సమస్త జీవరాసుల జీవన విధానానికి సంబంధించి ఆయన సమతుల్యతను సాధిస్తుంటాడు. అలాంటి శ్రీమహావిష్ణువు రూపాన్ని దర్శించడం వలన ... ఆయన నామాన్ని స్మరించడం వలన అనేక జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. లోక కల్యాణం కోసం వివిధ అవతారాలను ... అనేక రూపాలను పొందిన స్వామిని అనుదినం భక్తులు పూజిస్తూనే ఉంటారు ... అనుక్షణం ఆరాధిస్తూనే ఉంటారు.

అయితే ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున స్వామిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించిన వారికి అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఫాల్గుణ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినే 'ఆమలక ఏకాదశి' అని అంటుంటారు. ఉసిరికాయనే ఆమలక ఫలం ... ధాత్రీ ఫలం అని పిలుస్తుంటారు. కార్తీకమాసంలో జరిపే శివారాధన విషయంలో విశిష్టమైన స్థానాన్ని కలిగినదిగా కనిపించే ఉసిరికాయ, ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు స్వరూపంగా భావించబడుతోంది.

అందువలన ... ఈ ఆమలక ఏకాదశి రోజున ఎవరైతే ఉసిరిచెట్టు కింద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో, వాళ్ల నివాసం పుణ్యాలకు పుట్టినిల్లుగా మారుతుందనీ, భోగ భాగ్యాలతో తులతూగుతారని చెప్పబడుతోంది. దీనిని బట్టి అటు శివ పూజలోను ... ఇటు కేశవుడి ఆరాధనలోను ఉసిరికాయకు గల ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ... పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి ... ఉపవాస దీక్షను చేపట్టి శ్రీమహావిష్ణువును సేవించాలి.

ఆ రాత్రంతా జాగరణ చేసి మరునాడు ఉదయం ద్వాదశి ఘడియలు ఉండగానే స్వామిని పూజించి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి ఉంటుంది. ఇక ఈ ఏకాదశి రోజున వ్రతాన్ని చేసిన తరువాత అయినా ... ఆ మరునాడు పూజ ముగించిన తరువాత అయినా దానం చేయాలని శాస్త్రం చెబుతోంది. ఎవరైతే ఆమలక ఏకాదశి సందర్భంగా దానం చేస్తారో, వారి సంపదలు రెట్టింపు అవుతాయనీ ... పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని చెప్పబడుతోంది.


More Bhakti News