శివుడు సృష్టించిన భీమతీర్థం

పుణ్యక్షేత్రాలకు వెళ్లిన వాళ్లు ముందుగా అక్కడి పుణ్యతీర్థాలలో స్నానమాచరించి దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక ఆయా క్షేత్రాల్లో ఆయా తీర్థాలు ఆవిర్భవించడం వెనుక పురాణపరమైన సంఘటనలు ఆసక్తికరంగా వినిపిస్తుంటాయి. స్థలపురాణంగా వినిపించే ఆ కథలు విన్నప్పుడు ఆశ్చర్యంతో పాటు భగవంతుడిపై మరింత విశ్వాసమూ కలుగుతుంది. కర్ణాటక ప్రాంతానికి చెందిన 'మృడేశ్వరం' క్షేత్రాన్ని దర్శించినప్పుడు ఇలాంటి అనుభూతి తప్పక కలుగుతుంది.

ఈ క్షేత్రంలో అడుగుపెట్టినవాళ్లు ఇక్కడి 'భీమతీర్థం' గురించి వింటారు. ఈ తీర్థంలో గల నీటిని తలపై చల్లుకోవడం వలన జన్మజన్మలుగా చేస్తూ వస్తోన్న పాపాలు పరిహారమవుతాయని అంటారు. ఇక ఈ నీటిని తీర్థంగా స్వీకరించడం వలన అనేక వ్యాధులు నివారించబడతాయని చెబుతుంటారు. ఇంతటి మహిమాన్వితమైన తీర్థం ఇక్కడ ఆవిర్భవించడం వెనుక ఓ ఆసక్తికరమైన కథ లేకపోలేదు.

అరణ్యవాసం సమయంలో ఈ ప్రదేశానికి చేరుకున్న పాండవులు ఓ శివరాత్రి రోజున ఇక్కడి స్వామికి అభిషేకం చేయాలనుకుంటారు. అందుకు అవసరమైన నీటి కోసం బయలుదేరిన భీముడు, దూరంగా వెళ్లి తాను నీళ్లు తెచ్చేలోగా లింగోద్భవ కాలం అయిపోతుందని భావిస్తాడు. అభిషేకానికి అవసరమైన నీటిని ప్రసాదించమని పరమశివుడిని ప్రార్ధిస్తాడు. ఆయన పట్టించుకోకపోవడంతో ఇక్కడి బండరాయికి తలను బాదుకోవడం మొదలుపెడతాడు.

ఆ బండరాయి పగిలి అక్కడి నుంచి జలధార ఉద్భవించడం చూసి భీముడు ఆశ్చర్యపోతాడు. వెనుదిరిగి చూస్తే అక్కడ చిరుమందహాసంతో శివుడు కనిపిస్తాడు. ఆ గంగాజలాన్ని అనుగ్రహించినది ఆయనేనని గ్రహించిన భీముడు స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు. అలా సాక్షాత్తు శివుడిచే సృష్టించబడిన ఈ తీర్థం ... భీముడి పేరుతో 'భీమతీర్థం' గా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు శక్తినీ ... ముక్తిని ప్రసాదిస్తోంది.


More Bhakti News