రామనామాన్ని జపించిన ఆంగ్లేయ అధికారి !

ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో భారతదేశంలోని ఎన్నో హిందూ దేవాలయాలు తమ వైభవాన్ని కోల్పోయాయి. భారతీయుల ఆధ్యాత్మిక విశ్వాసాలను వాళ్లు చులకనగా చూడటమే అందుకు కారణం. అయితే కొంతమంది ఆంగ్లేయ అధికారులు మాత్రం, హిందూ దైవాలను విశ్వసిస్తూ దేవాలయాల అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. పరిపాలనా సంబంధిత పనులపై ఆయా క్షేత్రాలను దర్శించిన ఈ ఆంగ్లేయ అధికారులు, అక్కడి స్వామి మహిమలను ప్రత్యక్షంగా తెలుసుకుని భక్తులుగా మారిపోయారు.

అలాంటి వారిలో ' లార్డ్ హార్డింగ్' ఒకడుగా కనిపిస్తాడు. 19 వ శతాబ్దం తొలినాళ్లలో ఈయన కడప జిల్లా కలెక్టర్ గా పనిచేశాడు. ఆ సమయంలోనే ఆయన ఒకసారి చిత్తూరు జిల్లాలో గల 'వాయల్పాడు' గ్రామానికి వచ్చాడు. అప్పుడు ఆయన ఇక్కడి సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని గురించి అక్కడివారిని అడిగాడట.

పూర్వం ఈ ప్రదేశంలో వాల్మీకీ మహర్షి తపస్సు చేశాడనీ, ఆ కారణంగానే ఈ ఊరుకి ఈ పేరు వచ్చిందని అక్కడి వాళ్లు చెప్పారు. ఆలయంలో గల మూర్తులను జాంబవంతుడు ప్రతిష్ఠించాడనీ, ఈ కారణంగా ఇక్కడి రాముడు మహా మహిమాన్వితుడని వివరించారు. తాను చాలా కాలంగా ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాననీ, ఆ వ్యాధి వెంటనే తగ్గిపోతే వాళ్లు చెబుతున్నట్టుగా ఇక్కడి రాముడు మహిమగలవాడని నమ్ముతానని అన్నాడు హార్డింగ్.

ఆ మరుసటి రోజు నుంచే ఉదర సంబంధిత వ్యాధి ఉపశమిస్తూ ఉండటం ఆయన గ్రహించాడు. ఆ వ్యాధి పూర్తిగా తగ్గగానే శ్రీరాముడిని దర్శించుకుని కృతజ్ఞతలు తెలియజేశాడు. అంతే కాకుండా స్వామివారి ఆలయానికి గోపురం ... ప్రాకారాలు ... మంటపాలు నిర్మించాడు. ఆ తరువాత రామనామాన్ని జపిస్తూ కాలంగడిపాడు. ఈ సీతారాముడిని దర్శిస్తే దీర్గవ్యాధులు నశిస్తాయని అనుభవ పూర్వకంగా చెప్పే భక్తులు ఎంతోమంది ఇక్కడ కనిపిస్తారు. ఈ క్షేత్రం మహిమాన్వితమైనదని ఆనందంగా అంగీకరిస్తారు.


More Bhakti News