హనుమ తోకకి వెన్నపూస ఎందుకు రాస్తారు?

పుణ్యక్షేత్రాలకి వెళ్లినప్పుడు .. దైవదర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చిన భక్తులు కనిపిస్తుంటారు. ఒకరి ఆచారవ్యవహారాలను ఒకరు ఆసక్తికరంగా గమనిస్తూ ఉండటం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక ఆయా పుణ్యక్షేత్రాల్లో కూడా అక్కడి విశ్వాసాలు ఆచార వ్యవహారాలుగా కనిపిస్తుంటాయి. వాటిని చూసినప్పుడు కాస్త ఆశ్చర్యంగా అనిపించినా, భక్తులుగా వాటిని ఆచరించి సంతృప్తిని పొందడం జరుగుతూ ఉంటుంది.

ఇలాంటి ఆచారమే ఒకటి మనకి తమిళనాడు రాష్ట్రానికి చెందిన 'సుచీంద్రం' లో కనిపిస్తుంది. త్రిమూర్తులు ఒకే లింగరూపంలో ఆవిర్భవించడం ఈ క్షేత్రం ప్రత్యేకత. లింగం పైభాగాన విష్ణు మూర్తి .. మధ్యభాగంలో శివుడు ... క్రిందిభాగంలో బ్రహ్మదేవుడు ఉన్నారని స్థలపురాణం చెబుతోంది. అహల్య విషయంలో గౌతమమహర్షి శాపానికి గురైన దేవేంద్రుడు, ఇక్కడి త్రిమూర్తులను ఆశ్రయించి శాపవిమోచనాన్ని పొందాడని అంటారు.

ఇంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో 18 అడుగుల హనుమంతుడి విగ్రహం కొలువై ఉంటుంది. ఇంతటి భారీ రూపాన్ని కొంచెం దూరం నుంచే పూర్తిగా చూడగలుగుతాం. సాధారణంగా హనుమంతుడి అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్లు ఆయనకి సిందూర అభిషేకం చేయిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా ఈ క్షేత్రంలో స్వామివారి తోకకు స్వయంగా 'వెన్నపూస' రాస్తుంటారు.

ఈ ఆచారం రామాయణ కాలంతో ముడిపడివుం దని ఇక్కడి వాళ్లు చెబుతుంటారు. సీతాన్వేషణ చేస్తూ లంకా నగరంలో అడుగుపెట్టిన హనుమంతుడు, కావాలనే రావణ సైన్యానికి పట్టుబడతాడు. రావణుడి ఆదేశం మేరకు ఆయన సైనికులు హనుమంతుడి తోకకు నిప్పుపెడతారు. ఆ సంఘటనని తనకి అనుకూలంగా మార్చుకున్న హనుమంతుడు తన తోకకి గల మంటను అక్కడి భవనాలకు అంటించి వాళ్లని భయభ్రాంతులకు గురిచేస్తాడు.

ఆ సంఘటనలో హనుమంతుడి తోక చాలావరకూ కాలిపోతుంది. ఆ బాధ నుంచి ఆయనకి ఉపశమనం కలగాలనే ఉద్దేశంతోనే ఇక్కడి స్వామి తోకకి 'వెన్నపూస' రాస్తున్నట్టుగా చెబుతారు. తరతరాలుగా వస్తోన్న ఈ ఆచారం వెనుక గల అర్థం ఇదేనని అంటారు. ఈ విధంగా హనుమంతుడి తోకకి వెన్నపూస రాస్తూ ఆయనకి ఉపశమనం కలిగించడం వలన, ఆ స్వామి ఆయురారోగ్యాలను ... అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని బలంగా విశ్వసిస్తుంటారు.


More Bhakti News