మహిమలు చూపే సాయి దేవుడు

పూర్వకాలం నాటి పుణ్య క్షేత్రాలను చూసినప్పుడు ... ఆనాటి వాటి వైభవాన్ని గురించి విన్నప్పుడు ఆ కాలంలో పుట్టి ఉంటే ఎంతో బాగుండేదని అనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ తరంలో పుట్టిన వాళ్లు చేసుకున్న అదృష్టం ఏదైనా ఉందంటే అది సాయిబాబాను గురువుగా స్వీకరించడమే ... అంకితభావంతో ఆయనను ఆరాధించడమే. పురాణాలలో వినిపించే కామధేనువును ... కల్పవృక్షాన్ని ఎవరూ చూడలేదుగానీ, ఆ రెండింటినీ కలిపి చూసిన భావన సాయి దర్శనభాగ్యం వలన కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

సరిగ్గా అలాంటి అనుభూతిని కలిగించే క్షేత్రం మనకి విశాఖపట్నం - సీతమ్మధారలో కనిపిస్తుంది. ఇక్కడి బాబా ఆలయానికి గోపురం ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. చక్కగా తీర్చిదిద్దబడిన ఈ ఆలయంలో అడుగడుగునా సాయి జీవితంలోని ముఖ్యఘట్టాలను తైలవర్ణ చిత్రాలు ఆవిష్కరిస్తూ ఉంటాయి. బాబా వేదిక నిర్మాణంలో కలప వాడటం వలన విభిన్నంగా ... వినూత్నంగా కనిపిస్తూ ఉంటుంది. భక్తులు బాబా దగ్గరిగా వెళ్లి ఆయన పాదాలను తాకేందుకు వీలుగా ఈ వేదిక నిర్మించబడటం విశేషం.

ఇక్కడి బాబా మహిమాన్వితుడనీ, ఆయన అనుగ్రహంతో ఆశించినవి పొందినవారు ఎంతోమంది ఉన్నారని చెబుతుంటారు. ఆయన చూపిన మహిమలను అనుభవపూర్వకంగా వివరిస్తుంటారు. శిరిడీలో మాదిరిగానే ఇక్కడ అభిషేకాలు ... అలంకారాలు ... హారతులు ... సేవలు నిర్వహిస్తుంటారు. పర్వదినాల సమయంలో ఆలయంలో భక్తులరద్దీ ఎక్కువగా ఉంటుంది.

సువిశాలమైన ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామి ... ఆంజనేయస్వామి ... వినాయకుడు ... కుమారస్వామి ప్రత్యేక మందిరాల్లో కొలువై భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. బాబా చల్లని చూపుల నీడలో తరించాలనుకునేవారికీ, ఆయన అమృత హస్తాల స్పర్శను అనుభవించాలనుకునేవారికి ఈ ఆలయ దర్శనం మనసున్నంత వరకూ మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది.


More Bhakti News