శివాజీని ఆశ్చర్య పరచిన సంఘటన !

ధైర్యం .. సాహసం .. మంచితనం .. మానవత్వం .. గురుభక్తి .. దైవభక్తికి ఒక రూపాన్ని కల్పిస్తే అది శివాజీ మహారాజు రూపమే అవుతుంది. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు పురుష రూపంలో అవతరించినదనీ, అందుకే శివాజీ ముఖంలో అంతటి తేజస్సు ఉంటుందని శత్రు రాజులే ఆయన గురించి గొప్పగా చెప్పుకునేవారు. శివాజీతో పోరాడి ఓడిన రాజులు చాలా తక్కువమందేనని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది ఆయన వస్తున్నాడని తెలిస్తేనే రాజ్యాలను వదిలి పారిపోయేవాళ్లు.

అప్పట్లో రాజులకు గల అభిరుచిని బట్టి, కళాకారులను ఆస్థానానికి రప్పించి సన్మాన సత్కారాలు జరపడం చేస్తుండే వాళ్లు. శివాజీ మాత్రం కళాకారులను అభినందించడానికి నేరుగా తానే వారి నివాసాలకు వెళ్లేవాడు. తాను వెళ్లడం వీలుపడకపోతే కానుకలు పంపించేవాడు. అలాంటి శివాజీ తుకారామ్ ను ... సమర్థ రామదాసును ఎంతగానో అభిమానిస్తూ ఉండేవాడు.

ఒక రోజున శివాజీ నిర్మిస్తున్న కోట దగ్గరికి సమర్థ రామదాసు వస్తాడు. నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూనే సమర్థ స్వామితో శివాజీ మాట్లాడుతూ ఉంటాడు. కోట నిర్మాణం వలన తాను అనేక మందికి పని కల్పించినట్టు అయిందనీ, తన కారణంగా వారి కడుపు నిండుతున్నందుకు ఆనందంగా ఉందని అంటాడు శివాజీ. ఆయనలో ఆ మాత్రం అహంకారం కూడా ఉండకూడదనే ఉద్దేశంతో, అక్కడికి దగ్గరలో గల ఒక బండరాయిని చూపించి దానిని పగులగొట్టించమని చెబుతాడు స్వామి.

అలాగే చేయించిన శివాజీ .. పగలగొట్టబడిన ఆ బండరాయి మధ్యలో ఓ కప్ప ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. బండరాయి మధ్యలో గల ఆ కప్పకి ఆహారం ఎలా చేరుతుందని శివాజీని అడుగుతాడు సమర్థ స్వామి. సృష్టిలోని ప్రతి జీవికి ఆహారాన్ని అందించేవాడు ఆ పరమాత్ముడేననీ, అందకు తాము కారకులమనుకోవడం అవివేకమని చెబుతాడు. అహంభావం సమూలంగా నాశనమైనప్పుడే జ్ఞాన జ్యోతి పరిపూర్ణమైన రూపాన్ని సంతరించుకుని వెలుగులు విరజిమ్ముతుందని అంటాడు. దాంతో తన అజ్ఞానాన్ని తొలగించిన సమర్థ రామదాసుకి మరోసారి శివాజీ వినయపూర్వకంగా నమస్కరిస్తాడు.


More Bhakti News