హనుమంతుడు పెకిలించిన కొండ

రావణ సంహారం చేయడానికి రామలక్ష్మణులు యుద్ధరంగాన నిలుస్తారు. మేఘనాథుడుతో తలపడిన లక్ష్మణుడు, ఆయన అదృశ్య శక్తుల ధాటికి తట్టుకోలేక స్పృహకోల్పోతాడు. అప్పటికప్పుడు సంజీవిని ఔషధం అవసరం కావడంతో, ఆ మొక్కకోసం ఓ పర్వత భాగాన్ని పెకిలించుకు వస్తాడు హనుమంతుడు. ఆ పర్వత భాగం 'పెంచలకోన'లోదేనని ఆ క్షేత్ర స్థలపురాణం చెబుతోంది.

నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడుతోన్న పెంచలకోన, నెల్లూరు సమీపంలో అలరారుతోంది. లక్ష్మీదేవి ... చెంచులక్ష్మిగా నరసింహస్వామిని పెనవేసుకున్న కారణంగా ... సంజీవిని మొక్క కోసం హనుమంతుడు ఇక్కడి పర్వతాన్ని పెకిలించిన కారణంగా ఈ క్షేత్రానికి పెంచలకోన అనే పేరు వచ్చినట్టు చెబుతుంటారు. ఇక్కడి పర్వతాన్ని పెకిలించడానికి హనుమంతుడు ప్రయత్నించిన ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తూ ఉండటం విశేషం.

రాముడికి అత్యంత ప్రీతిపాత్రుడైన లక్ష్మణుడిని మామూలు మనిషిని చేసి రాముడి దుఃఖాన్ని పోగొట్టినందుకు కృతజ్ఞతగా హనుమంతుడు ఈ క్షేత్రాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడని అంటారు. భక్తులు ఈ క్షేత్రానికి బయలుదేరిన దగ్గర నుంచి తిరిగి వాళ్లు ఇంటికి చేరుకునేవరకు హనుమంతుడు సంరక్షిస్తూ ఉంటాడని చెబుతుంటారు. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా హనుమంతుడి దర్శనం చేసుకుంటారు.

మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన, నరసింహస్వామి అవతారంలోని పరిణయ ఘట్టాన్ని ... రామావతారంలో సంజీవిని కోసం హనుమంతుడిని పంపించి ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతుంది. పవిత్రమైన ఈ క్షేత్రానికి పదే పదే ప్రణమిల్లాలని అనిపిస్తూ ఉంటుంది.


More Bhakti News