దేవుడికి అనేక ముఖాలు చేతులు ఉంటాయా ?

అనంతమైన ఈ విశ్వాన్ని నడిపించే శక్తినే అందరూ దైవంగా భావిస్తుంటారు. అయితే కాల చక్రాన్ని నడిపించే క్రమంలో ఆ శక్తికి ఎన్నో రూపాలు ... మరెన్నో నామాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో సమస్త జీవరాశికి చైతన్యాన్ని ప్రసాదించే అమ్మవారినీ, సృష్టి - స్థితి - లయలను క్రమపద్ధతిలో నడిపించే త్రిమూర్తులను ప్రధాన దైవాలుగా ఆరాధిస్తూ ఉంటారు. ప్రధాన దైవాలుగా చెప్పుకునే శ్రీమహావిష్ణువు ... శివుడు ... ఆదిపరాశక్తి లోక కల్యాణం కోసం అనేక అవతారాలను ధరిస్తూ వచ్చారు.

అలా జనంలోకి వచ్చిన భగవంతుడి రూపాలను ... వాటివలన లోకానికి జరిగిన మేలును మానవాళి మరిచిపోలేదు. ఈ కారణంగానే ఒకరు రాముడిని అర్చిస్తే ... మరొకరు కృష్ణుడిని పూజిస్తారు. ఓ వైపున అమ్మవారి ఆరాధనలను ... మరో వైపున ఆదిదేవుడికి అభిషేకాలు జరిపిస్తుంటారు. లోకకల్యాణం కోసం వివిధ రూపాలను ధరించిన దైవాలు అనేక తలలను ... చేతులను కలిగి ఉన్నట్టుగా వర్ణించిన తీరు ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంటుంది. అందుకు తగినట్టుగా మలచిన శిల్పాలు ... గీసిన చిత్ర పటాలు దర్శనమిస్తుంటాయి.

ఈ నేపథ్యంలో దేవతలకు ... దేవుళ్లకు నిజంగానే ఇన్నేసి తలలు ... చేతులు ఉంటాయా ? మహిమలు తెలిసిన దేవుళ్లకు ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఎందుకు ? అనే సందేహం కొంతమందిలో కలుగుతుంటుంది. ఇందుకు చక్కని వివరణ మనకి ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తూ ఉంటుంది. భగవంతుడికి భక్తుల ముందు తన శక్తి యుక్తులను చాటుకోవలసిన పనిలేదు. అనేక ముఖాలు ... చేతులు ... ఆయుధాలు అన్నీ కూడా ఆయనలోని వివిధ అంశలకు ప్రతీకలుగా అర్థం చేసుకోవాలి.

బహుముఖాలు ... బాహువులు ... దైవం శక్తి సామర్థ్యాలకు నిదర్శనంగా చెప్పబడుతున్నవే కానీ, నిజంగా ఆయన అసలు రూపమే అది కాదు. భగవంతుడిలోని అనేక శక్తులను ఆవిష్కరించడంలో భాగంగా ఆనాటి శిల్పకారులు ... చిత్రకారులు ఇలాంటి ప్రయత్నంచేసి ఉండొచ్చు. ఏ దైవం అనేక తలలను .. చేతులను ... ఆయుధాలను ధరించినట్టు కనిపించినా, అవన్నీ కూడా అనంతమైన శక్తులు ఆ దైవంలో దాగి ఉన్నాయనే సత్యాన్ని తెలియజేయడంకోసమేనని గ్రహించాలి. అంతటి శక్తి సామర్థ్యాలు కలిగిన దైవం తమకి అండగా ఉందనే ధైర్యాన్ని అందరికీ కలిగించడంకోసమేననే గమనించాలి.


More Bhakti News