పశ్చాత్తాపం పాపాలను కడిగేస్తుందా ?

జమదగ్ని మహర్షి ధ్యానంలో ఉన్న సమయంలో కార్తవీర్యుడు అక్కడికి వస్తాడు. జమదగ్నిని హతమార్చి కామధేనువును తనతో తీసుకెళ్లిపోతాడు. తల్లి ద్వారా ఈ విషయం తెలుసుకున్న పరశురాముడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు. 21 మార్లు క్షత్రియులపై దండెత్తి సమూలంగా నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. గండ్రగొడ్డలి భుజాన వేసుకుని తిరుగుతూ క్షత్రియులను సంహరిస్తూ తన మాటను నిలబెట్టుకుంటాడు.

అలాంటి పరిస్థితుల్లోనే ఆయనకి ఒక ఆలోచన వస్తుంది. గండ్రగొడ్డలికి అంటిన రక్తం కడగడం వలన పోతుంది కానీ, చేసిన పాపాలు పోవడానికి ఏం చేయాలి ? అని ఆవేదన చెందుతూ ఉంటాడు. ఆవేశంతో తాను తీసుకున్న నిర్ణయం కారణంగా, హింసకి పాల్పడిన మునికుమారుడిగా తాను చరిత్రలో మిగిలిపోకూడదని అనుకుంటాడు.

భార్గవరాముడిగానే తాను అందరిమనసులో నిలిచిపోవాలనీ, అందుకోసం ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచన చేస్తూ పరశురాముడు సతమతమైపోతుంటాడు. ఈ విషయంలో తనకి తగిన మార్గాన్ని సూచించమని తల్లిదండ్రులను ప్రార్ధిస్తాడు. ఆవేశానికి ఆత్మజ్ఞానమే విరుగుడుగా పనిచేస్తుందనీ, ఈ విషయంలో దత్తాత్రేయస్వామిని ఆశ్రయించమని వాళ్లు చెబుతారు. దాంతో దత్తాత్రేయస్వామిని కలుసుకుని ఆయనకి వినయంగా నమస్కరిస్తాడు పరశురాముడు. తనకి జ్ఞానోపదేశం చేయమని దత్తాత్రేయుడిని కోరతాడు.

ఆవేశం ... ఆందోళన ... ఆవేదన ... ఇలా అంచలంచెలుగా మానసిక స్థితిని అనుభవిస్తూ వస్తోన్న పరశురాముడిని దత్తాత్రేయుడు ఆప్యాయంగా ఆదరిస్తాడు. పశ్చత్తాపమే పాపాల భారాన్ని తగ్గిస్తుందనీ, జరిగిన దాని గురించి చింతించవద్దని చెబుతాడు. ఆయన శ్రీమన్నారాయణుడి అవతారమనే విషయాన్ని గుర్తుచేస్తాడు. దత్తాత్రేయస్వామి నుంచి జ్ఞానోపదేశాన్ని పొందిన పరశురాముడు, ప్రశాంతచిత్తుడై తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లిపోతాడు.


More Bhakti News