మోక్షాన్ని ప్రసాదించే మహేశ్వరుడు

మహాశివుడికి మహాభక్తుడైన మంజునాథుడు ఓ రోజున తన ఆశ్రమానికి చేరుకుంటూ ఉండగా, గతంలో అతనిపట్ల ద్వేషం పెంచుకున్న కొందరు ఆవేశంతో అడ్డుకుంటారు. తమ కార్యకలాపాలకు అడ్డుతగిలినందుకు ఫలితమంటూ కత్తులతో దాడిచేస్తారు. తీవ్రమైన గాయాలతో మంజునాథుడు తన ఆశ్రమానికి చేరుకుంటాడు. ఇక తన ఆయుష్షు తీరనుందనే విషయం అతనికి అర్థమైపోతుంది.

అదే సమయంలో కైలాసానికి చేరుకున్న యమధర్మరాజు, మంజునాథుడి ఆయువు ముగియనుందనే విషయాన్ని శివుడితో చెబుతాడు. గతంలో శివ మహాభక్తుల విషయంలో తనకి ఎదురైన అనుభవాలను గురించి ప్రస్తావిస్తాడు. మంజునాథుడి విషయంలో నిర్ణయం దేవదేవుడిదేనంటూ, ఆయన చేతిలో యమపాశం వుంచి వెళతాడు.

ఆ యమపాశాన్ని తీసుకుని మంజునాథుడి ఆశ్రమానికి వెళతాడు పరమశివుడు. తాను వచ్చిన పని గురించి భక్తుడితో చెబుతాడు. తన ఆయుష్షును తీసుకుని వెళ్లడానికి వచ్చిన పరమశివుడి పాదాలకి మంజునాథుడు సాష్టాంగనమస్కారం చేస్తాడు. ఆదిదేవుడికి ఆతిథ్యం ఇవ్వాలనే తన చిరకాల కోరికను తీర్చవలసిందిగా కోరతాడు. అందుకు సదాశివుడు అంగీకరించడంతో, ఆయనకి అతిథి మర్యాదలు చేసి భోజనం వడ్డిస్తాడు.

ఓ వైపున శరీరానికైన గాయాలు బాధిస్తున్నా, అనురాగంతో అన్నం కలిపి ముద్దలు చేసి మరీ తినిపిస్తాడు. ఓ తల్లి తనబిడ్డ ఆకలి తీర్చడం కోసం ఎంతలా ఆరాటపడుతుందో, అంతలా మంజునాథుడు ఆరాటపడుతుంటాడు. అతని ప్రేమానురాగాలను చూసిన శివుడు, కంఠంలో విషాన్ని దాచుకున్నంత తేలికగా కళ్లలో నీళ్లు దాచుకోలేకపోతాడు. ఆయుష్షును హరించడానికి వచ్చిన తనకి ఆతిథ్యమిచ్చిన మంజునాథుడిని శివుడు తనలో ఐక్యం చేసుకుని మోక్షాన్ని ప్రసాదిస్తాడు.


More Bhakti News