అడవిలో దారి చూపే కాలభైరవుడు

కష్టాల్లో కూరుకుపోతున్నప్పుడు ... ఆపదలో చిక్కుకున్నప్పుడు ఎవరైనా సరే దేవుడిపైనే భారం వేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరి కారణంగా చిన్నపాటి సాయం లభించినా అది ఆ దేవుడి మహిమేననుకుంటూ ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతుంటారు. అలాంటిది దారీ తెన్నూ తెలియక అడవిలో చిక్కుకున్నవారిని ఒక మూగజీవి గమ్యానికి చేరిస్తే, అంతకన్నా మహిమాన్వితమైన సంఘటన మరొకటి ఉండదు.

అలాంటి మహిమాన్వితమైన క్షేత్రంగా 'భైరవకోన' కనిపిస్తుంది. ప్రకాశం జిల్లా పరిధిలోకి వచ్చే ఈ దట్టమైన అడవిలో ప్రాచీనకాలంనాటి గుహాలయాలు కనిపిస్తాయి. ఈ గుహాలయాలలో పరమశివుడు ... పార్వతీదేవి ... భైరవుడు ... నందీశ్వరుడు దర్శనమిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో కొలువుదీరిన తొమ్మిది శివలింగాలు అత్యంత విశిష్టమైనవిగా చెబుతుంటారు. పరమపవిత్రమైన ఈ క్షేత్రాన్ని అనుక్షణం భైరవుడు పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఆయన అనుమతి లేకుండా ... అనుగ్రహం లేకుండా ఏ జీవరాశి కూడా ఈ క్షేత్రంలోకి ప్రవేశించలేదని చెబుతుంటారు.

ఇక ఈ క్షేత్రాన్ని దర్శించడం కోసం అడవిలో ప్రవేశించి దారితప్పిపోయిన వాళ్లు ఎందరో ఉన్నారు. అలా దారి తప్పిన వాళ్లు మరింత ప్రమాదకరమైన అడవిలోకి వెళ్లేవాళ్లు. అలాంటి పరిస్థితుల్లో చిక్కుబడిన భక్త బృందాలు తిరిగి ఆలయం దగ్గరికి క్షేమంగా చేరుకునేవి. ఓ కుక్క దారి చూపడం వలన తాము క్షేమంగా తిరిగి రాగలిగామని వాళ్లు తమ అనుభవాలను చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ కుక్క రూపంలో భక్తులకు సాయపడుతూ వస్తున్నది సాక్షాత్తు భైరవుడేనని అందరూ విశ్వసిస్తుంటారు.

అంతేకాకుండా దట్టమైన ఈ అడవిలో అత్యంత విషపూరితమైన సాలె పురుగులు ... సర్పాలు విపరీతంగా తిరుగుతూ ఉంటాయి. ఇక కాస్త పొద్దుపోతేచాలు పులులు ... సింహాల వంటి మృగాల అరుపులు వినిపిస్తూనే ఉంటాయి. ఇంతటి భయంకరమైన ఈ అడవీ ప్రదేశంలో ఇంతవరకూ భక్తులకు ఎలాంటి ప్రాణహాని జరగలేదు. అందుకు కారణం కూడా ఆ శివుడి అనుగ్రహమనీ, భైరవుడి ఆశీస్సులని చెప్పుకుంటూ ఉంటారు ... ఇది మహాదేవుడు ప్రత్యక్షంగా కొలువైన మహిమాన్విత క్షేత్రమని ఒప్పుకుంటూ ఉంటారు.


More Bhakti News