అభయమునిచ్చే ఆంజనేయుడు

భారతీయులు అత్యంత పవిత్రమైనదిగా భావించే రామాయణ మహాకావ్యంలోను ... వారి విశాల హృదయాలలోను హనుమంతుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అశోకవనంలో కూర్చుని ఉన్న సీతాదేవి దగ్గరికి హనుమంతుడి వెళ్లి తన విశ్వరూపాన్ని చూపించే సన్నివేశం రామాయణం చదివిన ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది.

తన శక్తిని సీతమ్మవారికి చూపడం వలన ఆమె కాస్త ధైర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో హనుమంతుడు తన ఆకారాన్ని పెంచుతూ వెళతాడు. అప్పుడు సీతమ్మ తల్లి ఆనందాశ్చర్యాలకి లోనవుతుంది. అలాంటి ఆశ్చర్యానికి గురిచేసే భారీ ఆకారంగల హనుమంతుడి విగ్రహాలు ఈ మధ్యకాలంలో అక్కడక్కడా నెలకొల్పబడి ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. గ్రామాలకి మధ్యలోను ... రహదారి పక్కనేగల కొండలపైన ఈ తరహా విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి.

రామాయంపేట మండల పరిధిలోగల 'తొనగండ్ల' లో భారీ హనుమంతుడి విగ్రహం ఈ నేపథ్యంలో ఏర్పాటుచేయబడినదే. అత్యంత బలిష్టంగా అభయ ముద్రలో ... 108 అడుగుల ఎత్తున కనిపించే ఇక్కడి హనుమంతుడు భక్తుల హృదయాలను కూడా అదే స్థాయిలో దోచేస్తుంటాడు. సాధారణంగా హనుమంతుడు అటు వైష్ణవ క్షేత్రాలకు ... ఇటు శైవ క్షేత్రాలకు పాలకుడిగా కనిపిస్తాడు.

అలాంటి హనుమంతుడిని ఇక్కడ చూస్తే ఈ పరిసరప్రాంతాలని ఆయన సంరక్షిస్తున్నట్టుగా అనిపిస్తుంది. భూమిని వేదికగా చేసుకుని ... ఆకాశాన్ని పందిరిగా అనుకుని నుంచుని దర్శనమిచ్చే హనుమంతుడిని దగ్గర నుంచి చూడటం చాలా కష్టం. సాధారణంగా ఈ తరహా విగ్రహాల చెంత పూజలు నిర్వహించే అవకాశాలు తక్కువగా ఉంటూవుంటాయి. కానీ అందుకు భిన్నంగా ఇక్కడి హనుమంతుడి సన్నిధిలో భజనలు ... నిత్య నామసంకీర్తనలు జరుగుతుంటాయి.

ఇక్కడి స్వామిని దగ్గరగా చూసి ఆయన అభయాన్ని అందుకోవడానికి వచ్చేవారు కొందరైతే, స్వామివారి భారీతనం ఆవిష్కరించే ఆశ్చర్యానుభూతిని పొందడానికి వచ్చే వారు మరికొందరు. ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ వెదజల్లబడే ఆధ్యాత్మిక పరిమళాలను ఆస్వాదిస్తూ కూర్చుంటే సమయం ఇట్టే గడిచిపోతుంటుంది.


More Bhakti News