దైవానుగ్రహం పొందిన ఇల్లాలు

కుంభకోణం సమీపంలో గల ఒక మారుమూల గ్రామంలో పేదవారైన దంపతులు నివసిస్తూ ఉండేవారు. కాయకష్టం చేస్తేనే తప్ప ఇద్దరికీ కడుపునిండేది కాదు. అటు ఇంటి పని ఇటు బయటపని చేస్తూనే ఆ ఇల్లాలు అనుక్షణం రాఘవేంద్రస్వామిని తలచుకుంటూ ఉండేది. ఎప్పుడు ఏది తింటున్నా ముందుగా రాఘవేంద్రస్వామికి మనసులోనే సమర్పించుకుని ఆ తరువాతనే తాను స్వీకరించేది.

సంతృప్తిని మించిన సంపదలేదని భావించే ఆ దంపతులకు సంతానం లేదనే బెంగ మాత్రమే ఉండేది. ఆమె రాఘవేంద్రస్వామి భక్తురాలు కావడం ... సంతానం లేక బాధపడుతూ ఉండటం చూసి, ఆ విషయం ఆ స్వామికి చెప్పమని ఊళ్లో వాళ్లు అనేవాళ్లు. ఒకసారి స్వామి దర్శనం చేసుకుని తన మనసులోని మాటను చెప్పాలని ఆ ఇల్లాలు అనుకుంది.

అయితే కుంభకోణం వెళ్లడానికి అవసరమైన దారి ఖర్చులను సంపాదించుకోవడమే అసాధ్యమైపోతుంది. ఒకరాత్రివేళ ఈ విషయాన్ని గురించే ఆమె ఆలోచిస్తూ కన్నీళ్ల పర్యంతమవుతుంది. ఆ రాత్రి స్వామివారు ఆ ఇల్లాలికి కలలో కనిపించి, తన కోసం ఆమె అంతదూరం రానవసరంలేదని చెబుతాడు. ఆమె భక్తి శ్రద్ధలు తనని రప్పించాయని అంటాడు. ఆమె మనసులోని మాట తనని చేరిందనీ, త్వరలోనే ఆమె కోరిక నెరవేరుతుందని అనుగ్రహిస్తాడు.

మరునాడు ఉదయమే ఆ ఇల్లాలు తనకి వచ్చిన కల గురించి భర్తతో సంతోషంగా చెబుతుంది. అనతికాలంలోనే ఆ ఇల్లాలు గర్భాన్ని ధరించి పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. చాలాకాలంగా సంతానం లేని ఆమె రాఘవేంద్రస్వామిని ఆరాధించి సంతానాన్ని పొందడంతో, ఆ స్వామి మహిమ మరోమారు ఆ చుట్టుపక్కల గ్రామాలకు పాకిపోతుంది. దాంతో ఇంటింటా రాఘవేంద్రస్వామిని పూజించే వారి సంఖ్య పెరిగిపోతుంది.


More Bhakti News