సాయిబాబా తలచుకుంటే సాధ్యంకానిదేది?

శిరిడీ గ్రామస్తులు సాయిబాబాను ధన్వంతరీగా ... దేవుడిగా భావించేవారు. కష్టాలు ... నష్టాలు ... బాధలు ... ఆపదలు ఏవొచ్చినా తమకి సాయిబాబా అండగా ఉన్నాడనే ధైర్యంతో వాళ్లు తమ జీవితాన్ని హాయిగా కొనసాగించేవాళ్లు. అలాంటి పరిస్థితుల్లోనే ఓ రోజున శ్యామాను నాగుపాము కరుస్తుంది. తనని కాటువేసి చరచరా పాకుతూ వెళుతోన్న నాగుపాముని చూసి శ్యామా భయపడిపోతాడు. తనని నాగుపాము కరిచిందని తన వాళ్లకి చెబుతాడు.

శ్యామాకు బాబాపై అపారమైన విశ్వాసం ఉండేది. మృత్యువు కూడా ఆయన సన్నిధిలో ఉన్నవారిని తీసుకువెళ్లడానికి వెనకడుగు వేస్తుందని ఆయన నమ్మేవాడు. అందువలన ఆయన బాబా దగ్గరికి వెళ్లాలని అనుకుంటాడు. ఒకవేళ బాబా కాపాడలేకపోతే ఆయన సన్నిధిలో మరణించడంకన్నా మరో అదృష్టం లేదనుకుంటాడు. అప్పటికే శరీరమంతటా విషయం పాకిపోతూ ఉండటంతో, పడుతూలేస్తూనే శ్యామా మశీదు దగ్గరికి చేరుకుంటాడు.

మశీదు మెట్లు ఎక్కుతోన్న శ్యామావైపు బాబా కోపంగా చూస్తూ వెంటనే దిగి వెళ్లిపొమ్మంటూ గద్దిస్తాడు. ఆ మాటకు శ్యామాతో పాటు అక్కడున్న వారంతా నివ్వెరపోతారు. బాబా అలా అనగానే శ్యామా శరీరాన్ని వేగంగా ఆక్రమిస్తోన్న విషయం, అందరూ చూస్తుండగానే కిందికి దిగుతూ వచ్చి అదృశ్యమవుతుంది. ఆశ్చర్యానందాలకి లోనైన శ్యామా ... కన్నీళ్ల పర్యంతమవుతూ బాబా పాదాలపై పడతాడు.

వెంటనే దిగి వెళ్లి పొమ్మంటూ బాబా ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేసినది శ్యామాపై కాదనీ, ఆయన వంట్లోని విషాన్ని ఉద్దేశించి అలా అన్నాడనే విషయం అందరికీ అర్థమవుతుంది. అలా తనపై విశ్వాసముంచిన భక్తుడి ప్రాణాలను బాబా కాపాడతాడు ... తనని మించిన వైద్యుడులేడనే విషయాన్ని ఈ లోకానికి మరోమారు చాటిచెబుతాడు.


More Bhakti News