అనారోగ్యాన్ని నటించిన వేంకటేశ్వరుడు

కలియుగదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి ఎక్కడ ఉంటే అక్కడ సంపద .. సంతోషం .. వేడుక .. వైభవం ఉంటాయి. అలాంటి వేంకటేశ్వరుడు ఆవిర్భవించిన ఒక్కో క్షేత్రం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుని విలసిల్లుతూ ఉంటుంది. మచిలీపట్నంలోని శ్రీవేంకటేశ్వరస్వామి వారు ఇలాంటి ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాడు.

16వ శతాబ్దం ద్వితీయార్థంలో వేంకటేశ్వరుడు మచిలీపట్నానికి సమీపంలో గల ఓ గామంలో ఉండేవాడు. అయితే ఆ కాలంలో అక్కడ మతకలహాలు జరుగుతూ, హిందువుల దేవాలయాలు ధ్వంసం చేయబడుతూ ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో వేంకటేశ్వరస్వామి ఆలయంపై దాడి జరగనుందని తెలిసి, కొందరు భక్తులు స్వామివారిని అక్కడి నుంచి తరలించేపనిలో పడతారు.

ఈ విషయం తెలిసిన హిందూ మతేతరులు, ఆ ఊళ్లో నుంచి బయటికివెళ్లే ఎడ్లబండ్లను సోదా చేయడం మొదలుపెడతారు. అదే సమయంలో స్వామి విగ్రహాన్ని ఒక వస్త్రంలో చుట్టి ఎడ్లబండిలో ఉంచి ఆ వైపుగా ఆయన భక్తులు వస్తారు. ఎడ్ల బండిలో ఎవరున్నారో చెప్పమని హిందూ మతేతరులు అడగడంతో, తమ బంధువుకి వంట్లో బాగోలేదనీ ... వైద్యం నిమిత్తం తీసుకు వెళుతున్నామని అబద్ధం చెబుతారు.

అక్కడి వారికి అనుమానం వచ్చి చూడబోతుండగా స్వామివారు అనారోగ్యంతో బాధపడుతున్నవాడిలా మూలిగాడట. అది చూసిన భక్తులే ఆశ్చర్యపోయారట. అలా ఆ బండిలో ఉన్నది మనిషేనని నమ్మించి బయటపడిన స్వామి, ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో తనకి ఆలయం నిర్మించమని భక్తులను ఆదేశించాడట. అలా ఇక్కడ అందమైన ఆలయం నిర్మించబడి, అశేష భక్తులకు కల్పతరువులా విలసిల్లుతోంది.

జరిగిన సంఘటన కారణంగా ఇక్కడ స్వామి ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని భక్తులు భావిస్తుంటారు. ఈ స్వామిని ఆశ్రయించిన భక్తుల ఇంట్లో లేమి అనేది లేకుండా చేస్తాడని విశ్వసిస్తుంటారు. విశేషమైన పర్వదినాల్లో ఇక్కడి స్వామిని మరింత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ, ఆయనకి జరిగే ప్రత్యేక సేవల్లో పాలుపంచుకుంటూ పునీతులవుతుంటారు.


More Bhakti News