పాండురంగడుని పోలిన వేంకటేశ్వరుడు

సాధారణంగా వేంకటేశ్వరస్వామి ఆలయాలలో మూలమూర్తి ఓ మాదిరి ఎత్తులో కొలువై కనిపిస్తుంది. మరికొన్ని ఆలయాలలో స్వామివారు గర్భాలయం నిండుగా నిలువెత్తున దర్శనమిస్తూ ఉంటాడు. వేంకటేశ్వరుడు అందగాడు ... అంతకు మించిన అలంకార ప్రియుడు. అందుకే విశాలమైన ఆ వక్షస్థలంపై ఎన్ని ఆభరణాలు ఉన్నా తక్కువగానే కనపడుతుంటాయి.

వేంకటేశ్వరస్వామి సౌందర్యాన్ని ఆయన అలంకరణ మరింతగా ఆవిష్కరిస్తూ ఉంటుంది. విగ్రహం ఎత్తుగా ఉన్నప్పుడే అలంకరణకి అనుకూలంగా ఉంటుంది. అందుకనేనేమో ఆ స్వామి విగ్రహాలు నిలువెత్తున దర్శనమిస్తూ ఉంటాయి. అయితే అందుకు పూర్తి భిన్నంగా చాలా చిన్న పరిమాణంలో వేంకటేశ్వరస్వామి కొలువైన క్షేత్రం మనకి వరంగల్ జిల్లా 'రామన్నపేట' లో కనిపిస్తుంది.

చాళుక్యులు నిర్మించిన ఈ ఆలయంలో అడుగడుగునా అద్భుతమైన శిల్పకళ ఆవిష్కృత మవుతూ ... ఆశ్చర్యచకితులను చేస్తూ ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోని దశావతారమూర్తులు మనసు మందిరంలోని భక్తి భావాలను వికసింపజేస్తాయి. ఇక్కడి గర్భాలయంలో వేంకటేశ్వరస్వామి ... పండరీపురంలోని పాండురంగస్వామిని తలపిస్తుంటాడు. స్వామివారు ఇలా కనిపించడం కూడా భక్తుల ముచ్చట తీర్చడం కోసమేనని చెప్పుకుంటూ ఉంటారు.

స్వామివారి గర్భాలయం పక్కనే గల ప్రత్యేక మందిరంలో గోదాదేవి పూజలు అందుకుంటూ ఉంటుంది. హనుమంతుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతుంటాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య అధికంగానే ఉంటుంది. ఇక్కడి స్వామివారిని దర్శించడం వలన కష్టాలు కర్పూరంలా కరిగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందుకు ఉదాహరణగా అనేకమంది అనుభవాలను వివరిస్తుంటారు.


More Bhakti News