ఆర్తితో పిలిస్తే దేవుడు పలుకుతాడా ?

దేవుడు ... పిలిస్తే పలుకుతాడా అనే ప్రశ్నకి పలుకుతాడనే సమాధానం వస్తుంది. అసమానమైన భక్తితో ఆరాధిస్తే దేవుడు దివి నుంచి భువికి దిగి, కోరిన కోరికలు నెరవేర్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు ఎన్నో మనకి సతీసక్కుబాయి జీవితంలో కనిపిస్తాయి. పండరీపురం వెళ్లి పాండురంగస్వామిని దర్శించుకోవాలని సక్కుబాయి ఆరాటపడుతూ ఉంటుంది. అందుకు అత్తగారు - ఆడపడచు అంగీకరించకపోవడంతో ఆవేదన చెందుతుంది.

దాంతో శ్రీకృష్ణుడు ... సక్కుబాయి భర్త రూపంలో వచ్చి, ఆమెను పండరీపురానికి పంపిస్తాడు. సక్కుబాయి రాకకోసం ఎదురుచూస్తూ ఆమె స్థానంలో ఆమె రూపంలో ఆ ఇంట్లో ఉండిపోతాడు. సక్కుబాయి పట్ల అత్తగారికి ... ఆడపడచుకి గల అభిప్రాయాలను మార్చేస్తాడు. అయితే పండరీపురం వెళ్లిన సక్కుబాయి పాండురంగస్వామిని చూసిన ఆనందంలో అక్కడే కుప్పకూలిపోతుంది. ఆమె చనిపోయిందని నిర్ధారణకాగానే అక్కడి వారు పండరీపురంలోనే ఆమెకి అంత్యక్రియలు జరుపుతారు.

విషయం తెలిసిన కృష్ణుడు సక్కుబాయి రాకుండా తాను ఆ ఇల్లు వదిలి వెళ్లకూడదని అనుకుంటాడు. భక్తురాలి ఇంట్లో ఆమె రూపంలో స్వామి చిక్కుకుపోవడం అమ్మవారికి ఆందోళన కలిగిస్తుంది. స్వామివారిని చేరుకొని తన ఆవేదనను వ్యక్తం చేస్తుంది. మహాశివుడిని ఒప్పించి సక్కుబాయిని బతికించి తీసుకు రావలసినదిగా అమ్మవారికి చెబుతాడు కృష్ణుడు. అమ్మవారి ప్రార్ధన మేరకు మహాశివుడు ప్రత్యక్షమై, సక్కుబాయిని సజీవంగా అప్పగిస్తాడు.

అమ్మవారు మారువేషంలో సక్కుబాయిని వెంటబెట్టుకుని ఆమె ఇంటికి తీసుకువెళుతుంది. నాటకీయంగా సక్కుబాయి స్థానంలో నుంచి శ్రీకృష్ణుడు పక్కకి తప్పుకుని, ఎవరికీ ఎలాంటి అనుమానం కలగకుండా ఆమె స్థానంలో ఆమెని ఉంచుతాడు. సక్కుబాయి దంపతులను ఆశీర్వదించి అదృశ్యమవుతారు. అయితే జరిగిందంతా తెలుసుకున్న సక్కుబాయి, పాండురంగస్వామి లీలా విశేషాలను అర్థం చేసుకుంటుంది. తనని పాండురంగడు అనుగ్రహించాడనే సత్యాన్ని తెలుసుకుంటుంది. కుటుంబసభ్యులతో కలిసి స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది.


More Bhakti News