ఆశ్చర్యచకితులను చేసే అందమైన క్షేత్రం

భారతీయులు ఏ ప్రాంతానికి వెళ్లినా వారి నరనరాన జీర్ణించుకున్న ఆధ్యాత్మికత అక్కడి పరిసరాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఫలితంగా అక్కడ భారతీయులు ఆరాధించే దైవాలు ఆవిర్భవించడం, దైవం పట్ల అపారమైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ అనేకమంది భారతీయులు ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలాకాలం క్రితమే మొదలైంది. అలా మలేషియా - కౌలాలంపూర్ ప్రాంతానికి వెళ్లిన ఓ భారతీయుడు, అక్కడ భారతీయ ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లాడు.

ఆయన తదనంతరం తండ్రి బాటలో కొనసాగాలని కొడుకు నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో కుమారస్వామి ఆయన కలలో కనిపించి, తన ఆలయాన్ని అక్కడి కొండపై నిర్మించమని ఆదేశించాడట. ఫలితంగా ఇక్కడి 'బత్తుకొండ' పై స్వామివారి ఆయుధాన్ని ఆయన ప్రతిష్ఠించి పూజిస్తూ ఉండటం ప్రారంభిస్తాడు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న భారతీయులకు ఈ ఆలయ సందర్శనం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని అందించసాగింది.

ఇక్కడి కొండలో అనేక గుహలలో వివిధ దేవతా మూర్తులు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక కొండపైగల ఈ గుహలకు చేరుకోవడానికి ముందు, కొండ దిగువున కుమారస్వామి భారీ విగ్రహం దర్శనమిస్తూ ఉంటుంది. 140 అడుగులు గల ఈ భారీ విగ్రహం బంగారుపూతతో మెరిసిపోతూ నయనమనోహరంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహంగా ప్రశంసలు అందుకుంటూ, ఈ క్షేత్రం విశిష్టమైనదిగా విలసిల్లడంలో ప్రధానపాత్రను పోషిస్తోంది.

ప్రకృతి సౌందర్యమంతా పోతపోసినట్టుగా కనిపించే ఈ కొండ వాకిట్లో కొలువుదీరిన కుమారస్వామిని దర్శించుకోకుండా, మలేషియా వెళ్లిన భక్తులెవరూ తిరిగిరారు. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన అనేక దోషాలు నివారించబడతాయని భక్తులు చెబుతుంటారు. విశిష్టమైన పర్వదినాల్లో ఇక్కడి భారతీయులంతా కలిసి, స్వామివారికి నిర్వహించే ప్రత్యేక పూజల్లో ... సేవల్లో పాల్గొంటూ ఉంటారు. ఆ స్వామి సేవా భాగ్యంలో తరిస్తూ ఉంటారు.


More Bhakti News