నెమలీకను పుస్తకాల్లో ఎందుకు ఉంచుతారు ?

నెమలీకను చూస్తే ప్రపంచంలోని అద్భుతాలలో దానిని కూడా చేర్చవచ్చునేమోనని అనిపిస్తుంది. ఏయే రంగులు కలిపి భగవంతుడు ఆ రంగును సృష్టించాడోనని ఆశ్చర్యం కలుగుతుంది. అసలు భగవంతుడి సృష్టిలో అందమైనదేది అని ఎవరైనా అడిగితే, వాళ్లకి నెమలీకను చూపించ వచ్చు. అలాంటి నెమలీక కనిపిస్తేచాలు చదువుకునే పిల్లలు దానిని పుస్తకాల్లో దాచుకుంటూ ఉంటారు. అది పుస్తకాల్లో నుంచి జారిపోకుండా ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటారు.

ఇక ఒక నెమలీక చూస్తేనే అంత అందంగా అనిపిస్తే, ఇక నెమలి పించం చూస్తే ఆ ఆనందాశ్చర్యాలకు హద్దుండదు. నెమలి పురి విప్పితే .. అద్భుతమైన వర్ణాన్ని ఆవిష్కరించే ఆ కన్నులను చూడటానికి రెండుకళ్లు సరిపోవనిపిస్తుంది. ఏ దేవతో శాపవశాత్తు ఆ పక్షిలా జన్మించిందనీ, అందుకే ప్రకృతిలోని సౌందర్యానికి ప్రతీకగా అది కనిపిస్తూ ఉంటుందని అనుకుంటారు.

అయితే గ్రీకులు నెమలిని తాము జ్ఞాన దేవుడిగా ఆరాధించే 'ఆర్గస్'కి ప్రతీకగా విశ్వసిస్తూ ఉంటారు. నెమలి ఈక ఎక్కడ ఉంటే అక్కడ జ్ఞానం వికసిస్తూ ఉంటుందని భావిస్తారు. ఈ కారణంగానే జ్ఞానానికి ప్రతిరూపాలుగా చెప్పుకునే గ్రంధాల్లో వాళ్లు నెమలీకను ఉంచుతుంటారు. అదే సంప్రదాయం ఆ తరువాత భారత దేశంలోనూ ప్రవేశించిందని అనుకోవచ్చు. భారతదేశంలోను పురాణపరంగా ... చారిత్రకపరంగా నెమలి తన ప్రత్యేకతను ప్రదర్శించి జాతీయ పక్షిగా విశిష్టమైన స్థానాన్ని దక్కించుకుంది.

శ్రీకృష్ణుడు నెమలి పించం తలపై ధరించేవాడు. కుమారస్వామి వాహనంగా కూడా నెమలి అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఇక అనేక మంది రాజులు ... ఆహ్లాదాన్ని కలిగిస్తాయనే కారణంగా నెమళ్ళను తమ అంతఃపురంలో పెంచిపోషించేవారు. నెమలి పించంతో తయారుచేసిన వస్తువులను ఉపయోగించేవారు. ఇలా నెమలికి గల పౌరాణిక నేపథ్యం ... చారిత్రక నేపథ్యం కారణంగా అది పవిత్రమైన పక్షి అనే భావనే దాని ఈకలను పుస్తకాల్లో భద్రపరచుకోవడానికి దోహదపడిందని చెప్పుకోవచ్చు.


More Bhakti News