దైవానికి నమస్కరిస్తే కలిగే ఫలితం ?

కష్టాలు ... కన్నీళ్లు మనిషిని దేవుడికి మరింత దగ్గరగా తీసుకువెళతాయి. సాయాన్ని అందించేవాడు ... సకల ప్రాణకోటిని సంరక్షించేవాడు ఆ భగవంతుడేననే విషయం అప్పుడు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సమయంలో ఆయనకి చేసే నమస్కారంలో గాఢత కనిపిస్తుంది. ''స్వామి నేను నిమిత్తమాత్రుడను ... అసమర్ధుడను ... నువ్వు సర్వ సమర్ధుడివి'' అనే మాట హృదయపు లోతుల నుంచి పైకి వస్తుంది.

సాధారణంగా దైవానికి ఒక నమస్కారం పెట్టేసి తమ దైనందిన వ్యవహారాల్లో మునిగిపోతుంటారు. ఇక ఏదైనా కష్టం వచ్చినప్పుడో ... ఆపదలో ... ఆర్ధికపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడో ప్రతి ఒక్కరూ దేవుడిని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ క్షణంలో వాళ్లు విగ్రహాల్లో నిజమైన దైవాన్ని దర్శించడానికి ప్రయత్నిస్తారు. శిరస్సును పూర్తిగా వంచి దేవుడి పాదాలచెంతవుంచి కన్నీళ్లతో నమస్కరిస్తారు. మరికొందరు ''నీదే భారం స్వామి'' అంటూ సాష్టాంగ నమస్కారం చేస్తారు.

ఈ నేపథ్యంలో ఒకే ఒక్క నమస్కారం వలన దైవం మనసు కరుగుతుందా? అనే సందేహం కొంతమందికి కలుగుతుంటుంది. అయితే భగవంతుడి మనసు గెలుచుకోవడానికి నమస్కారానికి మించిన సాధనం మరొకటి లేదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. భగవంతుడి పాదాలచెంత శిరస్సును వంచి నమస్కరించడమంటే, అహాన్ని అక్కడ వదిలినట్టు అవుతుంది.

ఇక సాష్టాంగ నమస్కారం వలన ''స్వామి నేను అనేది లేనేలేదు .. బుద్ధి .. శరీరం .. ప్రాణం .. ఇవన్నీ నీవిచ్చినవే, అవన్నీ కూడా నిన్ను అర్ధిస్తున్నాయి .. కాదనకుండా కనికరించు'' అని చెప్పినట్టు అవుతుంది. ఎప్పుడైతే అహంకారం నశిస్తుందో ... అప్పుడు భగవంతుడి యొక్క తత్త్వం అర్థమవుతుంది. తన తత్త్వాన్ని అర్థం చేసుకున్న వారి పట్ల భగవంతుడు తన చల్లని చూపులను ప్రసరింపజేస్తాడు. దాంతో ఎవరు దేనిని ఆశిస్తూ ఆర్తిగా ... అంకిత భావంతో నమస్కరిస్తారో వాళ్లకి తగిన ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది.


More Bhakti News