దేవదేవుడు ధ్యానం చేసిన దివ్యక్షేత్రం

పరమశివుడి అనుగ్రహాన్ని కోరుతూ ఎంతోమంది దేవతలు ... మరెంతో మంది మహర్షులు ... మహారాజులు వివిధ ప్రాంతాల్లో అనేక శివలింగాలను ప్రతిష్ఠించారు. ఆ క్షేత్రాలన్నీ నేడు అత్యంత విశిష్టమైనవిగా భక్తులచే నీరాజనాలు అందుకుంటున్నాయి. అయితే సాక్షాత్తు పరమశివుడే ధ్యానం చేసినట్టుగా చెప్పబడుతోన్న క్షేత్రం మనకి మెదక్ జిల్లా సదాశివపేట మండల పరిధిలోగల 'కొల్కూరు'లో దర్శనమిస్తుంది. సదాశివుడు ఆవిర్భవించిన కారణంగానే ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చినట్టుగా చెబుతుంటారు.

మంజీరానది తీరంలో విలసిల్లుతోన్న ఈ క్షేత్రంలో శివపార్వతులు ఆలయం ... పుష్కరిణి అతి పురాతనమైనవని చరిత్రను బట్టి తెలుస్తుంది. అయితే పరమశివుడు ధ్యానం చేసినట్టుగా చెప్పబడుతోన్న గుహ ... గుట్టపై ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. పూర్వం ఇక్కడి గుహకి గల ఓ రంధ్రం నుంచి కాంతికిరణాలు బయటికి వస్తూ ఉండటం ఓ రైతు చూశాడట. ఆ రంధ్రం నుంచి ఓంకార ధ్వని తరంగాలు బయటికి వస్తూ ఉండటంతో ఆశ్చర్యపోతాడు. ఓ రాయి దానంతట అదే ఆ రంధ్రాన్ని మూసి ఉంచుతుండటం చూసి భయంతో గ్రామంలోకి పరిగెడతాడు.

విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పరుగు పరుగున అక్కడికి వచ్చి రంద్రం గుండా ప్రత్యక్షంగా ఆ కాంతిపుంజాన్ని చూస్తారు. ఆ గుహలో శంకరుడు ధ్యానంలో ఉన్నట్టుగా నిర్ధారించుకుని పూజలు నిర్వహించడం మొదలుపెడతారు. ఆనాటి నుంచి ఇక్కడి గుహ ద్వారం చెంతగల రాయిని గ్రామస్తులు ఆరాధిస్తూ ఉంటారు. గుహలో నుంచి అప్పుడప్పుడు ఓంకారం వినిపిస్తూ ఉండటం వలన, శివుడు ధ్యానం కొనసాగుతూనే ఉందని భావిస్తారు. ఆయన ధ్యానానికి భంగం కలిగించకూడదనే ఉద్దేశంతో గుహలోకి వెళ్లడానికి ఇంతవరకూ ఎవరూ ప్రయత్నించలేదు.

ఓ నాగుపాము ఈ గుహకు రక్షణగా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుందని అంటారు. ఆ నాగుపామును చూసిన భక్తులు ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ధర్మబద్ధమైన కోరికను మనసులో పెట్టుకుని ఎవరైతే ఇక్కడి స్వామిని ఆరాధిస్తారో, వారికి ఆశించిన ఫలితం దక్కుతుందని విశ్వసిస్తుంటారు. ప్రతి ఏడాది ఇక్కడ ఘనంగా జరిగే స్వామివారి కళ్యాణోత్సవంలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని తరిస్తుంటారు.


More Bhakti News