కరుణించే కనకదుర్గ అమ్మవారు

దుర్గతులను నశింపజేయునదే దుర్గాదేవి అని పురాణాలు చెబుతున్నాయి. దుర్గాదేవిని పూజించడం వలన దుఃఖము ... దారిద్ర్యము నశిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. దుర్గాదేవిని ఆరాధించడం వలన సంపదలు ... విజయాలు లభిస్తాయనీ, సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఈ కారణంగానే అమ్మవారు ఎక్కడ కొలువై వున్నా, ఆ తల్లికి భక్తులు నిత్య నీరాజనాలు సమర్పిస్తూనే ఉంటారు.

అలా 'తాటికాయలపాలెం' లోని అమ్మవారు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించబడుతోంది. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో గల ఈ ఆలయం, గంటి - పెదపూడి మీదుగా సఖినేటిపల్లి వెళ్లే మార్గంలో కనిపిస్తుంది. గోదావరికి చాలా దగ్గరలో గల తాటికాయలపాలెంలో గ్రామ ప్రవేశద్వారం దగ్గరే అమ్మవారి ఆలయం కనిపిస్తుంది.

ఇక్కడి దుర్గమ్మ తల్లి ప్రతిమ కాస్త భారీగానే కనిపిస్తుంది. విశాల నేత్రాలతో అమ్మవారు కరుణామృతాన్ని కురిపిస్తూ ఉంటుంది. రహదారి పక్కనే ఆలయం ఉండటం వలన, ఆ దారిన వచ్చి వెళ్లేవాళ్లు అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజలు జరుపుతుంటారు. అమ్మవారిని దర్శించుకున్న మహిళా భక్తులు చీర సారెలు సమర్పిస్తూ ఉంటారు.

ఇక్కడి అమ్మవారు చల్లని తల్లియనీ, భక్తులకు ఎలాంటి లోటు రానీయకుండా సకల శుభాలను కలిగిస్తుందని చెబుతుంటారు. ఇక్కడి అమ్మవారికి సమీపంలో అనేక ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు విలసిల్లుతూ ఉండటం విశేషంగా అనిపిస్తుంది. తన బిడ్డల వంటి భక్తుల పట్ల ఆ తల్లి కళ్లలో తరగని వాత్సల్యం కనిపిస్తుంది.


More Bhakti News