కష్టించి సంపాదించినదే నిలుస్తుందా ?

జీవితంలో అవసరాలు తీరాలన్నా ... ఆపదల నుంచి గట్టెక్కాలన్నా ... ఆనందంగా గడపాలన్నా అందుకు డబ్బుకావాలసి ఉంటుంది. ఈ కారణంగానే అందరూ డబ్బు సంపాదనకి ఎంతో ప్రాధాన్యతను ఇస్తుంటారు. అలా సంపాదించగా వచ్చిన డబ్బును ఎంతో జాగ్రత్తగా ఖర్చుచేస్తూ ఉంటారు.

డబ్బు సంపాదన విషయంలో కొందరు నీతి నియమాలకు కట్టుబడి ఉంటే, మరికొందరు ఎలాగైనా సరే డబ్బు సంపాదించడమే ముఖ్యమని భావిస్తుంటారు. సంపాదన కూడా భగవంతుడి అనుగ్రహమేననీ, ఆ మార్గం ఆయన చూపించినదేనని కొందరు విశ్వసిస్తూ వుంటారు. దేవుడు తమకి సాయం చేశాడు గనుక, ఆయన ఇచ్చిన దాంట్లో కొంత దానధర్మాలు చేస్తుంటారు.

మరికొందరు తమ సంపాదనకి కారణం తమ తెలివితేటలేనని పొంగిపోతూ ఉంటారు. అన్యాయంగా ... అక్రమంగా ... దౌర్జన్యంగా సంపాదిస్తూ, నిస్సహాయుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే భగవంతుడనే వాడు ఇదంతా చూస్తూనే ఉంటాడనే విషయాన్నే వీళ్లు మరిచిపోతుంటారు. ఎవరైతే నీతికి నిలబడి కష్టించి సంపాదిస్తారో ... తమకి కలిగిన దాంట్లో నలుగురికీ దానధర్మాలు చేస్తారో వాళ్లకి పదింతల ఐశ్వర్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు.

ఇక అన్యాయంగా సంపాదించిన సొమ్ము ఎలాంటి పరిస్థితుల్లోను మంచి కార్యాలకి ఉపయోగపడదు. ఒకవేళ ఇలాంటి సొమ్ముతో శుభకార్యాలు చేసినా ... దైవకార్యాలు చేసినా అవి సరైన ఫలితాలను ఇవ్వవు. అన్యాయంగా సంపాదించిన సొమ్ము ... అంతకు ముందు న్యాయబద్ధంగా సంపాదించిన దానిని కూడా తీసుకుపోతుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కష్టపడి సంపాదించినదే కడవరకూ ఉపయోగపడుతుంది. మోసంతో సంపాదించిన సొమ్ము మధ్యలోనే మాయచేసి వెళ్లిపోతుంది.


More Bhakti News