సాక్ష్యం చెప్పిన దేవుడు !

తాము చెబుతున్నది నిజమని నిరూపించడం కోసం 'దైవసాక్షి' గా ... 'భగవంతుడి సాక్షి' గా అనే మాటలను ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా భగవంతుడిని సాక్షిని చేయడమనేది పూర్వకాలం నుంచీ ఉంది. అలా ఓ భక్తుడి విషయంలో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన దేవుడు, అక్కడే కొలువైన క్షేత్రం మనకి గుంటూరు జిల్లా 'పొన్నూరు'లో దర్శనమిస్తుంది.

పూర్వం ఈ ప్రాంతానికి చెందిన కేశవశర్మ అనే ఓ బ్రాహ్మణుడు, సంతానాన్ని కోరుతూ యాత్రలను చేయాలనుకుంటాడు. భార్యతో పాటుగా మేనల్లుడైన గోవిందశర్మని వెంటబెట్టుకుని బయలుదేరుతాడు. అలా వాళ్లు కొన్ని క్షేత్రాలను చుట్టబెట్టి కాశీకి చేరుకుంటారు. ప్రతి క్షేత్రంలోను .. తనకి ఆడపిల్లని ప్రసాదించమని కేశవశర్మ కోరడాన్ని గోవిందశర్మ గమనిస్తాడు.

కాశీ క్షేత్రంలో వుండగా గోవిందశర్మ తన మామ దగ్గర ఆ ప్రస్తావన తీసుకు వస్తాడు. ఆడపిల్ల పుడితే భావనారాయణస్వామి సాక్షిగా తనకిచ్చి పెళ్ళిచేయాలని కోరడమే కాకుండా మాట కూడా తీసుకుంటాడు. కాలక్రమంలో కేశవశర్మ దంపతులకు ఆడపిల్ల కలగడం ... పెళ్లీడుకి రావడం జరిగిపోతాయి. కాశీలో మేనల్లుడికి ఇచ్చిన మాటను తప్పి తన కూతురికి మరొకరితో పెళ్లి జరిపించడానికి కేశవశర్మ సిద్ధపడతాడు.

గతంలో తనకి ఇచ్చిన మాటను గురించి గోవిందశర్మ ప్రస్తావిస్తే, సాక్ష్యం చెప్పడానికి ఆ దేవుడినే పిలుచుకు రమ్మని నిర్లక్ష్యంగా సమాధానమిస్తాడు. పెద్ద మనుషులు కూడా ఈ విషయంలో ఓ నిర్ణయానికి రాలేక సతమతమైపోతుంటారు. జరుగుతోన్న ఈ అన్యాయం గురించి గోవిందశర్మ భావనారాయణస్వామికి మొరపెట్టుకుంటాడు. అందరూ చూస్తుండగానే భావనారాయణస్వామి ఓ దివ్యమైన తేజస్సు రూపంలో అక్కడ ప్రత్యక్షమవుతాడు.

కూతురు పెళ్లి విషయంలో కేశవశర్మ తన మేనల్లుడికి మాట ఇవ్వడం నిజమేననీ, ఇచ్చిన మాటకి కట్టుబడి వారి వివాహం జరిపించమని సాక్ష్యం చెబుతాడు. అది భగవంతుడి ఆదేశం కావడంతో అందరూ కలిసి అలాగే జరిపిస్తారు. అప్పటి నుంచి ఇక్కడి స్వామివారిని 'సాక్షి భావనారాయణ స్వామి' గా భక్తులు కొలుచుకుంటూ ఉంటారు. మహిమాన్వితమైన ఈ సంఘటనను గురించి ఇప్పటికీ అక్కడ ఆసక్తికరంగా చెప్పుకుంటూనే వుంటారు.


More Bhakti News