భగవంతుడి పట్ల విశ్వాసమే రక్షిస్తుంది

శ్రీ ఆదిశంకరుల వారి కాలంలోనే హిందూ ధర్మాన్ని రక్షించడానికి తమ వంతు కృషిచేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో 'కుమారిల భట్టు' ఒకరు. హిందూ ధర్మం పట్ల భట్టుకి గల అభిమానం ... హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఆయన చేసిన సాహసం శంకరుల వారినే ఆశ్చర్యచకితులను చేసింది.

అప్పట్లో శంకరుల వారు ఏ ప్రాంతానికి వెళ్లినా, అక్కడి వారికి కుమారిల భట్టు గురించి చెప్పేవాడట. ఆయనని ఆదర్శంగా తీసుకుని హిందూ ధర్మాన్ని పరిరక్షించమని కోరేవాడు. అంతగా స్వామివారి మనసు దోచుకున్న కుమారిల భట్టు సకల శాస్త్రాలలోని సారాన్ని గ్రహిస్తాడు. సనాతన ధర్మాన్ని ఆయన ప్రాణంగా ప్రేమించేవాడు.

అయితే ఆ కాలంలో బౌద్ధమత ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. వాళ్ల ధోరణి హిందూ ధర్మానికి భంగం కలిగించేలా ఉండటం భట్టుని బాధిస్తుంది. బౌద్ధ ధర్మం ఏం చెబుతుందో తెలుసుకుంటే గానీ, హిందూ ధర్మం గొప్పతనాన్ని గురించి వారితో వాదించలేమనే నిర్ణయానికి వస్తాడు. హిందూ ధర్మానికి కంచుకోట వంటి కాశీ క్షేత్రాన్ని వదిలి బౌద్ధ ధర్మానికి కేంద్రంగా చెప్పుకునే తక్షశిలకు చేరుకుంటాడు. తన గురించిన వివరాలను దాచి బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ ధర్మాన్ని అధ్యయనం చేస్తాడు.

పరిపూర్ణమైన అవగాహన రాగానే, తన గురించిన నిజాలు బయటపెడతాడు. బౌద్ధ ధర్మాన్ని ఖండిస్తూ సనాతన హిందూ ధర్మంలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తాడు. భగవంతుడే సర్వానికీ యజమాని అనీ ... అందుకు వేదాలే ప్రమాణమని ... అందరినీ రక్షించువాడు ఆ పరమాత్ముడేనని వాదన చేస్తాడు. అతని వాదనను తాము అంగీకరించాలంటే భగవంతుడు రక్షిస్తాడు అనే విషయం పట్ల తమకి విశ్వాసం కలగాలని వాళ్లు అంటారు. అందుకోసం అక్కడి ఎత్తైన భవనం పై నుంచి దూకమనీ, అతనికి ఏమీ కాకపోతే భగవంతుడు రక్షించినట్టుగా ఒప్పుకుంటామని అంటారు.

ఆ సమయంలో వెనకడుగు వేస్తే హిందూ ధర్మాన్ని తానే అవమానపరచినట్టు అవుతుందని భట్టు భావిస్తాడు. హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో, ఆ భవనం పై నుంచి దూకేస్తాడు. అంతెత్తు నుంచి కిందపడినా ఆయనకి ఏమీ కాకపోవడం వాళ్లకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తాను నమ్మిన ధర్మం తనని కాపాడినందుకు భట్టు సంతోషంతో పొంగిపోతాడు. వాళ్లు పెట్టిన పరీక్షలో విజయం సాధించినందుకు సంతృప్తి చెందుతాడు.


More Bhakti News