శృంగార వల్లభుడి దివ్య దర్శనం

సాధారణంగా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లినా, ముందుగా అక్కడి పుష్కరిణిలో స్నానం చేసి దైవ దర్శనం చేసుకుంటూ వుంటారు. గర్భాలయంలో కొలువై వున్నది ఏ దైవమైనా, ఆ విగ్రహ పరిమాణం అందరికీ ఒకేలా కనిపిస్తూ వుంటుంది. అందుకు పూర్తి భిన్నంగా ... భక్తుల ఎత్తును బట్టి స్వామివారి విగ్రహ పరిమాణం కనిపించే క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలోని మరో 'తిరుపతి'లో విరాజిల్లుతోంది.

ఈ క్షేత్రంలో స్వామివారిని భక్తులు 'శృంగార వల్లభుడు'గా కొలుస్తూ వుంటారు. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు ... గర్భాలయానికి ఎదురుగా గల ఓ ప్రదేశంలో నుంచుని స్వామివారిని చూస్తే, ఎవరి ఎత్తుకు తగినట్టుగా వారికి అంతే ఎత్తులో స్వామి కనిపిస్తాడు. అనిర్వచనీయమైన ... ఆశ్చర్యకరమైన ఈ అనుభూతిని పొందిన వాళ్లు, ఇది అత్యంత మహిమాన్వితమైన క్షేత్రమని అంగీకరిస్తారు.

స్వామివారు భక్తుల ఎత్తుకు సమానమైన ఎత్తులో ఇక్కడ దర్శనమివ్వడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం స్థల పురాణంగా వినిపిస్తుంది. పూర్వం విష్ణుమూర్తి సాక్షాత్కారాన్ని పొందడం కోసం ధృవుడు ఈ ప్రదేశంలో కఠోర తపస్సు చేశాడు. ఆ బాలకుడి భక్తికి మెచ్చిన స్వామి ప్రత్యక్షమవుతాడు. అయితే ఆయన భారీ రూపాన్ని చూడటానికి ధృవుడు భయపడ్డాడట.

అది గ్రహించిన స్వామివారు ... కంగారు పడవలసిన పనిలేదనీ, తాను కూడా అతని అంత ఎత్తే ఉన్నానంటూ భయాన్ని పోగొడతాడు. అలా ధృవుడిని అక్కున చేర్చుకున్న స్వామి, ఆనాటి నుంచి అదే మాటకి కట్టుబడి భక్తుల ఎత్తుకు తగినట్టుగా కనిపిస్తూ అనుగ్రహిస్తూ వుంటాడు. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన, భక్తులకు భగవంతుడు ఎంత దగ్గరగా ఉంటాడనేది అర్థమవుతుంది.


More Bhakti News