పరమశివుడిని అభిషేకించే పాతాళ గంగ

శివాలయాలలో లింగరూపంలో గల శివుడికి అనునిత్యం అభిషేకాలు జరుగుతూనే వుంటాయి. శివుడిని అభిషేకించడం వలన సమస్త పాపాల నుంచి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే భక్తులు శివాలయాలకి బారులుకడుతూ వుంటారు. ఆదిదేవుడికి అభిషేకాలు జరపడానికి ఆరాటపడుతుంటారు.

అయితే శివుడికి అభిషేకం చేసుకోవడానికి భక్తులకు ఆరునెలల పాటు అవకాశం ఇచ్చి, మరో ఆరునెలలపాటు గంగమ్మతల్లి స్వయంగా శివుడిని అభిషేకించే క్షేత్రం మనకి శ్రీకాకుళం జిల్లా 'పాతపట్నం' లో కనిపిస్తుంది. పంటపొలంలో స్వయంభువుగా లభించిన ఇక్కడి శివుడికి 16 వ శతాబ్దం ద్వితీయార్థంలో అదే ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించారు.

ఈ ఆలయంలో గల శివుడికి జనవరి నుంచి జూన్ వరకూ భక్తులు అభిషేకాలు నిర్వహిస్తారు. ఆ తరువాత జూలై మాసం నుంచి గర్భగుడిలో నీరు ఊరడం మొదలవుతుంది. అలా భూగర్భం నుంచి ఉబుకుతూ వచ్చిన నీరు ఆరు నెలలపాటు శివుడిని అభిషేకిస్తూ వుంటుంది. ఆ తరువాత ఆ నీరు దానంతట అదే కనిపించకుండా పోతుంది. శివుడు నీటిలో ఉన్నా నిత్యపూజలు ... నైవేద్య సమర్పణలు నిర్విఘ్నంగా జరుగుతూనే వుంటాయి.

ఎక్కడి నుంచి ఈ నీరు వస్తుందో ... ఎలా మాయమైపోతుందో ఎవరికీ అంతుచిక్కక పోవడం విశేషం. మహిమాన్వితమైన ఈ విశేషాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ క్షేత్రానికి వస్తుంటారు. గర్భాలయంలోని నీళ్ల మధ్య కొలువుదీరిన నీలకంఠస్వామిని దర్శించి, పాతాళ గంగను తీర్థంగా స్వీకరిస్తుంటారు. ఈ తీర్థాన్ని సేవించడం వలన అనేకరకాల వ్యాధుల బారినుంచి విముక్తి లభిస్తుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.


More Bhakti News