మదురైలోని వైగై నది ప్రత్యేకత

మదురైలోని 'వైగై'నది ఎంతో ప్రత్యేకతను ... మరెంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఇది పవిత్రమైన నదిగా ... పాపాలను కడిగేసే పుణ్యనదిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఈ నదిని ప్రవహింపజేసినది సాక్షాత్తు సదాశివుడని స్థలపురాణం చెబుతోంది. అమ్మవారు మీనాక్షిగా అవతరించగా ... సుందరేశ్వరుడు పేరుతో ఆదిదేవుడు ఆమె మనసును గెలుచుకుంటాడు. వారి ప్రేమ పరిణయానికి దారితీస్తుంది.

వివాహానికి సుందరేశ్వరుడు తన తరఫున 'గంధోదరుడు' అనే మరుగుజ్జును మాత్రమే తీసుకుని వస్తాడు. ఆయనకి బలగంలేదనే ఉద్దేశ్యం ధ్వనించేలా ... తాము చేసిన వంటకాలన్నీ మిగిలిపోతాయంటూ మీనాక్షీదేవి నిరాశా నిస్పృహులను వ్యక్తం చేస్తుంది. అతను ఆరగించగా మిగిలితే మిగతా వారిని తీసుకుని వస్తానని చెబుతాడు సుందరేశ్వరుడు. ఆయన అన్నట్టుగానే ఉన్నవన్నీ వడ్డించినా ... అప్పటికప్పుడు వండించినా గంధోదరుడు ఆకలిగానీ ... దాహంగాని తీరవు.

అతిథిని సంతృప్తి పరచలేని దోషం అంటుతుందని మీనాక్షీదేవి తల్లిదండ్రులు సుందరేశ్వరుడి దగ్గర ఆవేదనని వ్యక్తం చేస్తారు. గంధోదరుడి ఆకలి తీర్చడానికే ఆందోళన చెందిన వాళ్లు, ఇక సుందరేశ్వరుడి శక్తి అసమానమైనదని అంగీకరిస్తారు. దాంతో శివుడు అన్నపూర్ణమ్మ తల్లినీ ... గంగాదేవిని పిలిచి గంధోదరుడి ఆకలినీ ... దాహాన్ని తీరుస్తాడు. అలా శివుడి ఆదేశం మేరకు వచ్చిన గంగాదేవి ... నేడు 'వైగై' పేరుతో ఇక్కడ ప్రవహిస్తూ వుంది.


More Bhakti News