ఆరోగ్యాన్నిచ్చే రేగుపండ్లు

సంక్రాంతి పండుగ వస్తుందనడానికి సూచనగా పల్లెల్లో రేగుచెట్లు విరగకాస్తుంటాయి. దోరగా ... ఎర్రగా పండిన రేగుపండ్లు నోరూరిస్తూ వుంటాయి. దాంతో వంకీ కత్తిని తలపించే రేగిముళ్లను లెక్కచేయకుండా పిల్లలు రేగుపండ్లు కోసేస్తుంటారు. ఇక పట్టణాల్లో కూడా ఏ కూడలిలో చూసినా రేగుపండ్లు విరివిగా కనిపిస్తుంటాయి. తోపుడు బండ్ల చుట్టూచేరి రేగుపండ్లను విపరీతంగా కొనుగోలు చేయడం కనిపిస్తూ వుంటుంది.

సంక్రాంతి సమయంలో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను, వాకిట్లో వేసిన ముగ్గుమధ్యలో వుంచి వాటిపై రేగుపండ్లు ఉంచుతుంటారు. ఇక చిన్న పిల్లలకు రేగుపండ్లను భోగి పండుగ రోజున తలపై నుంచి పోస్తారు. ఈ వేడుకనే 'భోగిపండ్లు' అని అంటారు. ఈ విధంగా చేస్తే రేగుపండ్లు శరీరాన్ని తాకుతూ వెళ్లడం వలన వ్యాధులు దగ్గరికి రాకుండా ఉంటాయని అంటారు. చిన్న పిల్లల ఆరోగ్యాన్ని ఆశించే దీనిని ఆచారాల్లో భాగంగా చేసి పెద్దలు ఈ వేడుకను జరుపుతుంటారు.

నిజంగానే రేగుపండులో అనేక రకాలైన ఔషధ గుణాలు వున్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అలా అని రేగుపండ్లను అతిగా తినకూడదు. ఏదైనా మితంగా తిన్నప్పుడే అది ఔషధంగా పనిచేస్తుంది. అతిగా తింటే విషంగా మారుతుందనే వైద్యశాస్త్రం చెబుతోంది. ఇక రేగుపండ్లు తేనె రంగులో వున్నవి ... పండినవి మాత్రమే తినాలి. పచ్చి రేగుపండ్లు తినడం వలన అనారోగ్యానికి గురయ్యే అవకాశం వుంది.

సాధారణంగా పల్లెల్లో చేలగట్లపై కాసే రేగుపండ్లు చిన్నవిగా కనిపిస్తూ పుల్లవిగా అనిపిస్తూ వుంటాయి. ఇక గంగరేగు పండ్లు ... సీమ రేగుపండ్లు కాస్త పెద్దవిగా కనిపిస్తూ తియ్యగా ... వగరుగా అనిపిస్తూ వుంటాయి. అయితే రేగుపండు ఏదైనా ... ఎక్కడిదైనా దానిలో ఆరోగ్యానికి సంబంధించిన ఔషధ గుణాలు పుష్కళంగా ఉంటాయనేది వాస్తవం. రేగుపండ్లు తినడం వలన వాతము ... పైత్యము ... కఫము తగ్గుతాయి. ఇవి కడుపులో మంటను ఉపశమింపజేయడమే కాకుండా జీర్ణశక్తిని పెంచుతాయి. మలబద్ధకాన్ని నివారించడమే కాకుండా, మూలవ్యాధి బారిన పడకుండా కాపాడతాయని చెప్పబడుతోంది.


More Bhakti News