పాపాలను పారద్రోలే పవిత్ర క్షేత్రం

జీవితంలో తెలిసో తెలియకో అందరి ఖాతాలోను పాపాలు జమ అవుతుంటాయి. అయితే వాటి ఫలితాలను అనుభవించవలసి వస్తుందేమోననే భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతూనే వుంటుంది. పశ్చాత్తాపపడటం వలన ... అందుకు ప్రాయశ్చిత్తంగా దానధర్మాలు చేయడం వలన ... క్షేత్ర దర్శనం వలన పాపాల ఫలితం తీవ్రత తగ్గుతుందని శాస్త్రం చెబుతోంది. ఈ కారణంగానే పూర్వం బాధ్యతలు తీరిపోగానే తీర్థయాత్రలు చేసేవారు.

అంతగా ప్రయాస పడకుండా పాపాలను హరించే క్షేత్రం అందుబాటులోనే కనిపిస్తుంది. అదే కరీంనగర్ జిల్లా 'కొత్తగట్టు'లోని మత్స్యగిరీంద్రస్వామి క్షేత్రం. ఒక పుణ్యక్షేత్రానికి ఉండవలసిన పురాణ నేపథ్యం ... చారిత్రక వైభవం మనకి ఈ క్షేత్రంలో పుష్కళంగా కనిపిస్తాయి. మత్స్యావతారంలో సముద్ర గర్భంలోకి ప్రవేశించిన శ్రీమహావిష్ణువు, రాక్షససంహారం చేసి వేదాలను రక్షించాడు. అదే అవతారంలో స్వామివారు ఇక్కడి కొత్తగట్టు (గుట్ట) పై ఆవిర్భవించాడని స్థల పురాణం చెబుతోంది.

ఇరు దేవేరులతో కొలువైన స్వామివారి దివ్యమంగళ రూపం నేత్రానందాన్ని కలిగిస్తూ వుంటుంది. ఎంతోమంది మహర్షులు ... మహారాజులు స్వామివారిని ఆరాధించినట్టు ఆధారాలు వున్నాయి. సహజ సిద్ధంగా ఇక్కడ ఏర్పడిన కోనేరులో స్నానమాచరించి స్వామివారి దర్శనం చేసుకుంటూ వుంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడి మత్స్య గిరీంద్రుడిని పూజించడం వలన సమస్త పాపాలు నశించిపోతాయనే విశ్వాసం పూర్వకాలం నుంచీ వుంది.

ప్రతి సంవత్సరం మాఘమాసంలోని పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని పది రోజుల పాటు జాతర జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారినీ ... అమ్మవార్లని దర్శించి వారి ఆశీస్సులు తీసుకోవడానికి ఈ ఊరు ఆడపిల్లలు అత్తవారి ఇంటినుంచి పుట్టినింటికి చేరుకుంటారు. తమని చల్లగా చూడమంటూ కానుకలు సమర్పించుకుంటారు. ఇక చుట్టుపక్కల ప్రాంతాలకి చెందిన వేలాదిమంది భక్తులు స్వామివారి ఉత్సవాల్లో పాలుపంచుకుని తరిస్తారు. ఈ సందర్భంగా జరిగే వాహనసేవలు ... భజనలు ... కోలాటాలు చూసితీరవలసిందే.


More Bhakti News