శ్రీ అనంతపద్మనాభ స్వామి వ్రతం

ఈ సృష్టిలో మానవ జన్మెత్తిన ప్రతి ఒక్కరికి ఆశ .. ఆకలి .. ఆత్మాభిమానం ఉంటాయి. వీటిలో ఆశకి సంబంధించిన విషయానికే వస్తే, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కోరుకుని దానిని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అలాంటి కోరికలను నెరవేర్చుకోవడానికి దైవానుగ్రహం అవసరమవుతూ వుంటుంది. కోరిన కోరికలు నెరవేర్చే ఆ దేవుడే అనంతుడు ... అందుకు చేయవలసినదే 'అనంత వ్రతం'.

అనంతుడనగా ... ఆది అంతములు లేని శ్రీ మహావిష్ణువు. ఆయన అనుగ్రహం కోసం చేసే ఈ వ్రతానికి 'భాద్రపద శుక్ల చతుర్థి' ఎంతో శ్రేష్టమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ అనంత వ్రతానికి ... అనంత చతుర్దశి ... పద్మనాభ చతుర్దశి అనే పేర్లు కూడా వున్నాయి. ఇక అత్యంత విశిష్టమైన ఈ వ్రతాన్ని గురించి ... అందుకు మూలమైన కథ గురించి తెలుసుకుందాం.

'భాద్రపద శుక్ల చతుర్దశి'నాడు ఉదయాన్నే తలారా స్నానం చేసి ... ఇంటిని శుభ్రపరిచి ఎనిమిది దళములు గల మండలమును ఏర్పాటు చేసుకోవాలి. మంటపం చుట్టూ రంగురంగుల ముగ్గులు పెట్టాలి. మంటపానికి దక్షిణ భాగంలో కలశాన్ని వుంచి ... మంటపానికి మధ్యలో 'దర్భలతో' చేసిన అనంతుడిని వుంచి ఆవాహన చేయాలి. 14 ముడులుగల తోరముని సిద్ధము చేసి దానిని కుంకుమలో తడిపి పూజలో ఉంచాలి.

ఈ 14 ముడులలో ఒక్కో ముడి ఒక్కో దేవతకు సంకేతం. ఆ దేవతలు ఎవరంటే, దిక్పాలకులు .. రవి .. వరుణుడు .. అగ్ని .. ఇంద్రుడు .. ఉపేంద్రుడు .. యముడు .. బ్రహ్మ .. చంద్రుడు .. చతురాననుడు .. జీవుడు .. శివుడు .. వాయువు .. అశ్వినీ దేవతలు. ఇంతమంది దేవతల సాక్షిగా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నానని చెప్పడమే ఈ 14 ముడులలోని ఆంతర్యం.

ఇక షోడశోపచార పూజ పూర్తి అయిన తరువాత పూర్ణములు గానీ, బూరెలు గాని నైవేద్యం పెట్టాలి. అనంత వ్రతంలో 14 అనే సంఖ్యకు ఎంతో ప్రాధాన్యత వుంది. అనంతుని పడగలు 14 ... ఇక చతుర్దశి అంటే 14 .. ఇక 14 భువనాలను ఏలే నాయకుడు కాబట్టి 14 రకాల పళ్లు ... 14 రకాల పిండివంటలు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టవలసి వుంటుంది. ఆ తరువాత స్వామివారి దగ్గర ఉంచిన తోరమును చేతికి కట్టుకుని 14 రకాల పదార్థాలను బ్రాహ్మణులకి వాయనం ఇవ్వాలి. ఆ తరువాత బ్రాహ్మణ సమారాధన చేయడంతో వ్రతం పరిసమాప్తమవుతుంది.

ఇక ఈ వ్రతం చేసుకోవలసినదిగా సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు పాండవులతో చెప్పాడు. జూదంలో ఓడిపోయిన పాండవులు అడవులలో అష్టకష్టాలు పడుతూ వుండగా వారిని పరామర్శించడానికి కృష్ణుడు వచ్చాడు. తాము పడుతున్న అవస్థల నుంచి గట్టెక్కే మార్గం చెప్పమని కోరిన పాండవులకు, అనంతుడను తానేనంటూ అనంత వ్రతం గురించి చెప్పాడు కృష్ణ భగవానుడు.

పూర్వం సుమంతుడు ... దీక్షాదేవి అనే దంపతులకు 'శీల'అనే కూతురు వుండేది. కాలక్రమలో దీక్షాదేవీ చనిపోవడంతో, సుమంతుడు రెండో వివాహం చేసుకున్నాడు. సవతి తల్లి అనేక విధాలుగా ఇబ్బందులను పెడుతున్నప్పటికీ శీల ఓర్చుకుంటూ, దైవం పట్ల అమితమైన భక్తిని ప్రదర్శించసాగింది. దేశ సంచారం చేస్తూ అటుగా వచ్చిన కౌండిన్య మునికి తన కూతురునిచ్చి వివాహం చేశాడు సుమంతుడు. అనంత పద్మనాభ చతుర్దశి నాడు ఆ దంపతులు అక్కడి నుంచి ఎడ్ల బండిపై బయలుదేరారు.

అలా వాళ్లు ఓ ఆశ్రమం మీదుగా వెళుతుండగా అక్కడ కొంతమంది స్త్రీలు ఎర్రని వస్త్రాలు ధరించి వ్రతం చేస్తుండటం కనిపించింది. దాంతో శీల వారిని ఆ వ్రతం గురించి అడిగి తెలుసుకుని, ఇప్పుడే వస్తాను విశ్రాంతి తీసుకోమంటూ భర్తతో చెప్పి అందరితో కలిసి తాను కూడా ఆ వ్రతంలో పాల్గొంది. తండ్రి ఇచ్చిన పిండిని బ్రాహ్మణుడికి వాయనమిచ్చి, భర్తతో కలిసి తమ ఆశ్రమానికి వెళ్లింది. ఆమె వ్రత ఫలితంగా ఆ ఆశ్రమం సిరిసంపదలకు నెలవైంది. ఆ దంపతులిద్దరూ సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నారు.

అలాంటి సమయంలో భార్య చేతికి కట్టుకున్న ఎర్రని తోరం చూసిన కౌండిన్యుడు, తనని వశ పరుచుకోవడం కోసమే ఆమె ఆ తోరం కట్టుకుందని భావించాడు. ఆమె అసలు విషయం చెబుతున్నా వినిపించుకోకుండా ఆ తోరాన్ని తెంపిపారేశాడు. కౌండిన్యుడి అహంకారం వల్ల అతని సిరిసంపదలు నశించాయి. ఆశ్రమం అగ్నికి ఆహుతి కావడం .. భార్య దూరం కావడం ... పురజనులు సహాయ పడకపోవడంతో మతి చలించిన వాడిలా అడవిలో తిరగడం మొదలు పెట్టాడు.

శీల కారణంగా అనంతుడు కనికరించి బ్రాహ్మణ వేషంలో కౌండిన్యుడికి కనిపించి, 14 సంవత్సరముల పాటు అనంతవ్రతం చేసుకోమని చెప్పాడు. దాంతో కౌండిన్యుడు తిరిగి భార్యను కలుసుకుని జరిగినది ఆమెకి చెప్పి అనంత వ్రతాన్ని ఆచరించి పూర్వ వైభవాన్ని పొందాడు. శ్రీ కృష్ణుడి సూచన మేరకు పాండవులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందారు.


More Bhakti News