సంపదల నిచ్చే గంగమాంబ క్షేత్రం

జీవితం సంతోషకరంగా కొనసాగాలంటే సంపదలు వుండాలి. సంపదలు కలగాలంటే వ్యవసాయమో ... వ్యాపారమో ... ఉద్యోగమో చేస్తూ వుండాలి. ఈ మూడింటిలో ఆశించిన ఫలితాలు రావాలంటే భగవంతుడి అనుగ్రహం వుండాలి. ఆయన చల్లని చూపు కోసమే అందరూ నిరీక్షిస్తుంటారు. దైవం సాయం అందరికీ అవసరమే అయినా, వ్యవసాయ దారులు మరికాస్త ఎక్కువ సాయాన్ని ఆశిస్తారు ... అర్ధిస్తారు.

నీళ్లు పుష్కళంగా ఉన్నప్పుడే పంటలు బాగా పండుతాయి. అప్పుడే పశువులకి కావలసిన ఆహారం సమృద్ధిగా లభిస్తుంది. అలా గ్రామీణులు తమ జీవనాధారమైన పాడిపంటల అభివృద్ధికి గాను గంగమ్మ తల్లిని ఆరాధించడం పూర్వకాలం నుంచి వస్తోంది. అలా ఆ తల్లి పూజాభిషేకాలను అందుకుంటోన్న క్షేత్రం చిత్తూరు జిల్లా 'కుప్పం'లో దర్శనమిస్తుంది. ఇక్కడి ప్రజలు అమ్మవారిని 'గంగమాంబ' పేరుతో కొలుస్తుంటారు.

ఇక్కడి గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తితో పాటు ఆ తల్లి వెలసిన ఓ రాతిపలక కూడా ఇక్కడ కొలువై వుంటుంది. ఈ రాతిపలక ఆలయ అర్చకుడికి తులసివనంలో లభించిందని చెబుతారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి శిరస్సు భాగం ఆకర్షణీయంగా దర్శనమిస్తూ వుంటుంది. ప్రతి మంగళ ... శుక్రవారాల్లో అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటూ వుంటారు.

ప్రతి ఏడాది 'మే' నెలలో గంగమ్మతల్లి జాతరను ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు ఆ తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ కానుకలు ... మొక్కుబడులు ... నైవేద్యాలు సమర్పించుకుంటూ వుంటారు. క్షేత్రపాలకుడిగా వినాయకుడు వ్యవహరించే ఈ క్షేత్రంలో, మారెమ్మ అమ్మవారు ... సీతారాములు ... హనుమంతుడు ... నాగదేవత పూజలు అందుకుంటూ వుంటారు.


More Bhakti News