సూర్యుడికి శాపవిమోచనం కలిగిన ప్రదేశం

కష్టనష్టాల్లో వున్న వాళ్లని పలకరిస్తే ''ఏం చేస్తాం .. అంతా విధి'' అంటూ వుంటారు. విధి రాతను విష్ణుమూర్తి కూడా తప్పించుకోలేడు అనే నానుడి ఈ సందర్భంలోనే గుర్తుకు వస్తూ వుంటుంది. సాధారణ మానవులు విధికి తలవంచి నడవకతప్పదు. ఇక దేవతలు కూడా విధిని విధిగా గౌరవిస్తూ అనుసరించవలసిందే. విధి రాతని అధిగమించడంగానీ, దానిని కాదని ఇతరులను రక్షించడంకాని దేవతలు చెయ్యరు.

అలాంటి సాహసం చేసిన నవగ్రహాలు శిక్షకు గురై .. దాని బారినుంచి బయటపడిన సంఘటన మనకి తమిళనాడు - కుంభకోణం సమీపంలో గల 'తిరుమంగళక్కుడి'లో కనిపిస్తుంది. పూర్వం ఓ మహర్షి తనకి కుష్ఠువ్యాధి పొడచూపగానే నవగ్రహాలను ఆరాధించడం మొదలుపెట్టాడు. ఆ మహర్షి భక్తికి మెచ్చి నవగ్రహాలు ప్రత్యక్షమై, ఆయన కుష్ఠువ్యాధిని నివారిస్తాయి. తాను రాసిన విధికి విరుద్ధంగా వ్యవహరించిన నవగ్రహాలపై బ్రహ్మదేవుడు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. ఆ మహర్షి అనుభవించవలసిన కుష్ఠువ్యాధిని వారు అనుభవించవలసి ఉంటుందని శపిస్తాడు.

ఫలితంగా నవగ్రహాలకు కుష్టువ్యాధి సోకుతుంది. దాంతో సూర్య చంద్రులతో పాటు మిగతా వాళ్లంతా కలిసి, ఇక్కడి మంగళాంబిక - ప్రాణనాథేశ్వరుడిని దర్శించి పూజించి శాపవిమోచనం పొందుతారు. ఇక నవగ్రహాల కారణంగా వ్యాధి బారినుంచి బయటపడిన మహర్షి, సూర్యుడు ప్రధాన దైవంగా ఇదే ప్రదేశంలో నవగ్రహాలకు ఆలయాన్ని నిర్మిస్తాడు. అదే సూర్యనార్ కోవిల్ గా ప్రసిద్ధి చెందింది.

నవగ్రహాలు ఆరాధించిన మంగళాంబిక - ప్రాణనాథేశ్వరుడిని ముందుగా పూజించి ఆ తరువాత నవగ్రహాలను దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయతీగా వస్తోంది. చర్మ సంబంధమైన వ్యాధులతో బాధపడుతోన్న వాళ్లు ఇప్పటికీ ఈ క్షేత్రాన్ని దర్శించి ఆశించిన ఫలితాలను పొందుతూ వుంటారు ... ఇది అత్యంత మహిమాన్వితమైన క్షేత్రమని ప్రగాఢమైన విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News