పవళింపు సేవలో శ్రీవారు

ఆపదలో వున్న భక్తులను రక్షించడం కోసం ... ఆర్ధికపరమైన ఇబ్బందుల్లో వున్న భక్తుల అవసరాలు తీర్చడం కోసం ... కష్ట నష్టాల నుంచి వాళ్లని గట్టెక్కించడం కోసం ఆ ఏడుకొండల స్వామి అనునిత్యం ... అనుక్షణం ఎంతగానో శ్రమపడుతుంటాడు. అంతగా అలసిపోయిన స్వామి కునుకు తీసేది కూసంత సేపే. ఆ కాసేపు కూడా స్వామి హాయిగా నిద్రించడానికి తిరుమలలో ప్రతిరోజు రాత్రి ఒకటిన్నర గంటలకు 'పవళింపు సేవ' (ఏకాంతసేవ)ను నిర్వహిస్తారు.

శయన మంటపంలో వెండిగొలుసులు కలిగిన తూగుటుయ్యాలను ఏర్పాటు చేస్తారు. ఈ ఊయలపై మెత్తటి పట్టుపరుపును సిద్ధంచేసి భోగశ్రీనివాసమూర్తిని శయనింపజేస్తారు. జగాలనేలే స్వామివారికి పాలు ... పండ్లు ... బాదంపప్పును నైవేద్యంగా సమర్పిస్తారు. ఇరువైపులా వెలుగుతోన్న దీపాల నడుమ ... అన్నమాచార్యుల వారి 'లాలిపాట' ను వింటూ హాయిగా శ్రీవారు నిద్రలోకి జారుకుంటాడు.

అలసిపోయిన స్వామి హాయిగా నిద్రిస్తోన్న తీరు చూస్తే, బిడ్డను నిద్రపుచ్చుతూ తల్లిపొందే అనుభూతే ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. కోట్లాదిమంది భక్తుల హృదయమనే ఊయలలో సైతం స్వామివారు ఊగుతోన్న దృశ్యం కనులముందు కదలాడుతోంది. అద్భుతమైన ఆ పవళింపుసేవ దృశ్యం చూడాలంటే వేలజన్మల పుణ్యం వెంటరావాలి ... గోవిందుడి అనుగ్రహం గోరంతైనా వుండాలి.

ఇక రాత్రి సమయంలో శ్రీవారిని పూజించేందుకు బ్రహ్మదేవుడు స్వయంగా వస్తాడని అంటారు. ఆయన పూజకు అవసరమైన ఏర్పాట్లు చేసి ... వెండి గిన్నెల్లో మంచినీరు ఉంచుతారు. ఈ విధంగా ఏడాదిలో పదకొండు నెలల పాటు భోగ శ్రీనివాసుడికి ఏకాంతసేవను నిర్వహిస్తారు. ఒక్క 'ధనుర్మాసం'లో మాత్రం శ్రీ కృష్ణుడికి ఏకాంత సేవను జరుపుతారు.


More Bhakti News