కూర్మావతారంలో వేణుగోపాలుడు

లోక కల్యాణం కోసం శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో కూర్మావతారానికి ఎంతో విశిష్టత వుంది. కూర్మావతారాన్ని ధరించిన విష్ణుమూర్తిని సహజంగానే భక్తులు దర్శించుకుంటూ వుంటారు. అలాంటి కూర్మావతారంలో వేణుగోపాలుడు కనిపిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. అలాంటి ఆశ్చర్యాన్ని కలిగించే క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా 'పెదకాపవరం' లో దర్శనమిస్తుంది.

ఇక స్వయంభువుగా ... కూర్మావతారధారిగా వేణుగోపాలుడు వెలుగుచూసిన తీరు మహిమాన్వితమైనదిగా అనిపిస్తుంది. ఈ గ్రామానికి చెందిన ఒక భక్తుడికి కలలో ముందుగా వేణుగోపాలస్వామి కనిపించి క్రమేపి కూర్మావతారాన్ని సంతరించుకున్నాడట. ఆ రూపంతో తాను స్వయంభువుగా అవతరించనున్నట్టు చెప్పి, ఉదయాన్నే కనిపించే గరుడ పక్షిని అనుసరించమని ఆదేశించాడు. మరునాడు ఉదయాన్నే ఆ భక్తుడు తనకి వచ్చిన కలను గురించి గ్రామస్తులకు చెప్పాడు.

ఆకాశ మార్గాన చాలా కిందగా ఎగురుతోన్న గరుడ పక్షిని గ్రామస్తులందరూ అనుసరించారు. ఓ ఎత్తైన ప్రదేశంపై గరుడపక్షి మూడుమార్లు ప్రదక్షిణ చేసి ఆ ప్రదేశంలో వాలింది. గ్రామస్తులు అక్కడ జాగ్రత్తగా తవ్వకాలు జరుపగా కూర్మావతార వేణుగోపాలస్వామి వారి విగ్రహం బయటపడింది. ఈ విగ్రహం అరుదైనదనీ ... అత్యంత విశిష్టమైనదని ... మహిమాన్వితమైనదని భక్తులు భావించారు. స్వామివారికి ఆలయాన్ని నిర్మించి .. ప్రతిష్ఠించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వస్తున్నారు.


More Bhakti News