అడిగినది ప్రసాదించే అమ్మవారి క్షేత్రం

అమ్మవారు ఎక్కడ ఆవిర్భవించినా అక్కడికి వచ్చే మహిళా భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. అలా నిత్యం మహిళా భక్తుల రాకతో సందడిగా కనిపించే క్షేత్రం మహారాష్ట్ర - కేలాపూర్ లో దర్శనమిస్తుంది. ఇక్కడ అమ్మవారిని 'జగదాంబ' పేరుతో భక్తులు కొలుస్తుంటారు. అమ్మవారు స్వయంభువు మూర్తి అనీ ... ఏకవీరికా దేవి - తుల్జా భవాని అమ్మవారు కలిసి జగదాంబగా అవతరించారని స్థలపురాణం చెబుతుంది.

ఏకవీరికా అమ్మవారు గానీ ... తుల్జాభవాని అమ్మవారు గాని ఆదిశక్తి అవతారాలుగా చెప్పబడుతున్నారు. ఈ అమ్మవార్లు ఆవిర్భవించిన క్షేత్రాలు శక్తి పీఠాలుగా అలరారుతున్నాయి. అలాంటి అమ్మవార్ల ఏకరూపంగా ఆవిర్భవించిన జగదాంబని భక్తులు మహాశక్తిగా ఆరాధిస్తూ వుంటారు. వందల సంవత్సరాలుగా ఈ తల్లి ఎంతో మందికి సంతాన సౌభాగ్యాలను ప్రసాదించిందని చెబుతారు.

గర్భాలయంలో అమ్మవారి మూర్తి పరిమాణం రీత్యా చిన్నదిగానే కనిపిస్తుంది. తలభాగం కాస్త పెద్దది గాను .. మిగతా అవయవాలు చిన్నవిగాను కనిపిస్తుంటాయి. ఈ కారణంగానే ఈ అమ్మవారిని గ్రామదేవతగాను ఆరాధిస్తుంటారు. ప్రతి మంగళ - శుక్ర వారాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక దేవీ నవరాత్రుల సందర్భంగా .. వసంత పంచమి సందర్భంగా ఈ క్షేత్రంలో ఘనంగా ఉత్సవాలు జరుపుతారు.

ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు. అమ్మవారికి తమ మనసులోని కోరికలను మనవి చేసుకుని కానుకలు సమర్పిస్తుంటారు. ఈ క్షేత్రంలో అమ్మవారి గర్భాలయం కింద నుంచి చాలా పెద్ద సొరంగ మార్గం వుంది. ఈ సొరంగ మార్గం గురించిన ఆసక్తికరమైన కథనాలు అనేకం ఇక్కడ వినిపిస్తుంటాయి.

ఇక అన్నిటికంటే విశేషమేమిటంటే ... ఇక్కడి అమ్మవారి ప్రతిమ ఏడాది ఏడాదికి పెరుగుతూ వుందని అంటారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లను సైతం చూపుతుంటారు. మహిమాన్వితమైన ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆ తల్లి ఆశీర్వాద బలం వలన సకల శుభాలు చేకూరతాయి.


More Bhakti News