కోరికలు నెరవేర్చు కొండంత క్షేత్రం

పుణ్యక్షేత్రాలు అలనాటి ఆధ్యాత్మిక నేపథ్యాన్ని ... చారిత్రక వైభవాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ వుంటాయి. ఘన చరిత్రను కలిగిన అలాంటి పుణ్యక్షేత్రాలలో కొన్ని మారుమూల ప్రాంతాల్లో వుండటం వలన తగినంత ఆదరణ పొందలేకపోతున్నాయి. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ మండల పరిధిలో గల 'బూరుగు గడ్డ' ఈ కోవకి చెందిన క్షేత్రంగా కనిపిస్తుంది. తరతరాలుగా తరగని ఆధ్యాత్మిక సుగంధాన్ని వెదజల్లుతోన్న ఈ క్షేత్రం ఈ గ్రామంలో వుండటం ఈ గ్రామస్తులు చేసుకున్న అదృష్టంగా చెప్పుకోవచ్చు.

పూర్వం భ్రుగు మహర్షి తపస్సు చేసుకున్న ప్రదేశం కావడం వలన ఈ ఊరికి 'భ్రుగు గడ్డ' అనే పేరు వచ్చింది. కాలక్రమంలో అది కాస్తా బూరుగుగడ్డలా మార్పు చెందింది. ఇక్కడ అడుగుపెట్టగానే ప్రాచీన కాలానికి చెందిన ఓ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టిన విషయం అర్థమైపోతుంది. అనేక ఆలయాల సముదాయంగా కనిపించే ఈ క్షేత్రం, ఒకనాటి వైభవాన్ని ప్రతిబింబిస్తూ వుంటుంది.

ఆదివరాహస్వామి ... అనంతపద్మనాభస్వామి ఆలయాలు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ వుంటాయి. ఈ ఆలయం 11 వ శతాబ్దం ద్వితీయార్థంలో పునరుద్ధరించబడిందంటే ఇది ఎంత ప్రాచీన క్షేత్రమో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కొలువుదీరిన 24 అడుగుల పొడవు గల అనంతపద్మనాభస్వామి విగ్రహం చూడటానికి రెండు కళ్లు సరిపోవు. అంతటి అనంతపద్మనాభుడు మనకి ఇంతటి అందుబాటులో వున్నాడా అనే ఆశ్చర్యం కలగకమానదు.

స్వామివారి సౌందర్యం ... అలంకరణ మనసును కట్టి పడేస్తాయి. ఎందరో రాజులు ... సంస్థానాధీశులు స్వామివారిని దర్శించిన ఆధారాలు వున్నాయి. స్వామివారి ధూప దీప నైవేద్యాల విషయంలో ఎప్పటికీ లోటు రాకూడదనే ఉద్దేశంతో వాళ్లు వందలాది ఎకరాలను సమర్పించారు. ఇక్కడి స్వామిని పూజించిన వారికి వివాహ యోగం ... సంతాన భాగ్యం కలుగుతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.

ఇదే ప్రాంగణంలో నరసింహస్వామి ... వేణుగోపాలస్వామి ... ఆంజనేయస్వామి భక్తులను అనుగ్రహిస్తూ వుంటారు. ప్రతి ఏడాది 'చైత్ర పౌర్ణమి' సందర్భాన్నిపురస్కరించుకుని ఇక్కడ తొమ్మిది రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. స్వామివారి కృపాకటాక్షలకు పాత్రులవుతుంటారు.


More Bhakti News