విజయాలను ప్రసాదించే దేవుడు

ప్రాచీనకాలం నాటి రాజులు ... వాళ్లు ఆరాధించిన దైవాలు ... నిర్మించిన ఆలయాలను పరిశీలిస్తే 'చెన్నకేశవస్వామి' కి వాళ్లు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆనాటి యుద్ధాలు ... వాటి తాలూకు విజయాలు రాజుల శౌర్య పరాక్రమాలకు ఫలితాలుగా కనిపిస్తాయి. యుద్ధానికి సంసిద్ధమయ్యేందుకు అవసరమైన శారీరక .. మానసిక బలాన్ని ఇచ్చేది చెన్నకేశవ స్వామియేనని విశ్వసించే వాళ్లు.

ఈ కారణంగానే చెన్నకేశవుడిని ఇలవేల్పుగా భావించి ఆరాధించే వాళ్లు. ఆ స్వామికి ఆలయాలు నిర్మించి తమ కృతజ్ఞతను చాటుకునే వాళ్లు. ఈ నేపథ్యంలో నిర్మించబడిన చెన్నకేశవస్వామి ఆలయం మనకి ప్రకాశం జిల్లా ఒంగోలులో కనిపిస్తుంది. ఒకప్పటి వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆలయం పునరుద్ధరణకి నోచుకుని కూడా చాలాకాలమే అయింది.

పురాణాలలోని ముఖ్య ఘట్టాలను ఆవిష్కరిస్తూ కనిపించే ప్రాకారాలు భక్తులకు ఆనందాశ్చర్యాలను కలిగిస్తాయి. అందమైన రాజగోపురం దాటుకుని లోపలికి వెళ్లే భక్తులు అడుగడుగునా భక్తిభావ పరిమళాలను ఆస్వాదిస్తూ వుంటారు. తనని దర్శించిన వారి యోగ క్షేమాలను స్వామివారు గమనిస్తూ ఉంటారని చెబుతుంటారు.

స్వామివారి అనుగ్రహంతో ఉన్నతమైన స్థితిని పొందిన వారు ఆయన సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ వుంటారు. ఇదే ప్రాంగణంలో శ్రీ సత్యనారాయణ స్వామి ... వేంకటేశ్వర స్వామి ... ఆంజనేయస్వామి ... శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు ... నాగదేవత పూజలు అందుకుంటూ వుంటారు. ఈ కారణంగా వివిధ పర్వదినాల్లో ఆలయం భక్తజనుల సందడితో కళకళలాడుతూ కనిపిస్తుంది.


More Bhakti News