తిరుమలలో ఉగ్ర శ్రీనివాసమూర్తి ప్రత్యేకత

ఉగ్ర శ్రీనివాసుడు అనే పేరు వినగానే చాలామందికి ఆశ్చర్యం కలుగుతూ వుంటుంది. ఎందుకంటే శ్రీనివాసుడులోని ఉగ్రత్వాన్ని చూసిన వాళ్లెవరూ లేరు. శ్రీనివాసుడు అనగానే మహా సౌందర్యాన్ని సంతరించుకున్న మనోహర రూపమే కళ్లముందు కదలాడుతూ వుంటుంది. ఆయన చిరుమందహాసమే తప్ప ఉగ్రత్వమనేది ఊహకి కూడా అందదు. అయితే తన భక్తులను రక్షించుకోవడం కోసం శ్రీనివాసుడు ఆగ్రహావేశాలను వ్యక్తం చేసిన సందర్భాలు వున్నాయని చెబుతుంటారు.

ఇక ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తి రూపం మనకి తిరుమలలోని 'ఆనందనిలయం' లో దర్శనమిస్తుంది. తిరుమలలో గల 'పంచబేరాలు' లో ఒకటిగా ఉగ్ర శ్రీనివాసమూర్తి కనిపిస్తాడు. మూలమూర్తిని ధృవ బేరంగాను .. వివిధ రకాల సేవలను అందుకునే మిగతా నాలుగు పంచలోహ మూర్తులను కలిపి పంచబేరాలు అంటారు. ఈ పంచబేరాల్లో ఉగ్ర శ్రీనివాసమూర్తికి ఓ ప్రత్యేకత వుంది.

పూర్వం ఉగ్ర శ్రీనివాస మూర్తిని ఉత్సవ బేరంగా భావించి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఊరేగింపుకు తీసుకువెళ్లారట. అంతే ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత పెరిగిపోవడమే కాకుండా, భక్తులను భయకంపితులను చేసే అనే సంఘటనలు వరుసగా చోటుచేసుకున్నాయట. దాంతో స్వామి వారు ఆగ్రహించారని గ్రహించిన అర్చకులు - భక్తులు శాంతించమని ప్రార్ధించారు.

ఇకపై సూర్యోదయం తరువాత ఈ మూర్తులకు ఊరేగింపు నిర్వహించరాదని ఓ భక్తుడి ద్వారా స్వామి అక్కడున్న వారికి చెప్పించాడట. అంతే కాకుండా 'మలయప్ప కోన' లో అన్వేషించి అక్కడ లభించే ప్రతిమలకే ఊరేగింపు జరపమని ఆదేశించాడు. అలా లభించిన స్వామియే నేడు 'మలయప్ప' గా పిలవబడుతూ ఉత్సవ బేరంగా పూజలందుకుంటున్నాడు. ఆనాటి నుంచి ఉగ్ర శ్రీనివాసమూర్తి 'స్నపన బేరం' గా సేవలు స్వీకరిస్తున్నాడు.

మహా శక్తిమంతము ... మహిమాన్వితము అయిన ఉగ్ర శ్రీనివాసమూర్తికి ఏడాదిలో కృష్ణాష్టమి - క్షీరాబ్ది ద్వాదశి అనే రెండు పర్వదినాల్లో మాత్రమే ఊరేగింపు నిర్వహిస్తారు. సూర్యోదయానికి ముందుగానే ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని పూర్తిచేసి, నైవేద్యం .. నీరాజనం సమర్పించి యథా స్థానంలో ఉంచుతారు.


More Bhakti News