కాకరపాదులో కనిపించిన కృష్ణుడు

పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు ఆయా క్షేత్రాలు అక్కడ ఆవిర్భవించిన తీరును తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. అలా తెలుసుకున్నప్పుడు ఆనందంతో కూడిన ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి ఆసక్తిని ... ఆశ్చర్యాన్ని కలిగించే క్షేత్రంగా మనకి కృష్ణా జిల్లా 'హంసలదీవి' దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలో స్నానమాచరించిన కాకి, తన శాపాన్ని పోగొట్టుకుని హంసలా మారినట్టు స్థల పురాణం చెబుతుంది. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి హంసలదీవి అనే పేరు వచ్చిందని అంటారు.

ఇదంతా వింటుంటేనే ఇది మహిమాన్వితమైన క్షేత్రమని తెలుస్తోంది. ఇక ఇక్కడి కృష్ణుడు 'కాకరపాదు' లో నుంచి బయటపడటం మరో విశేషంగా కనిపిస్తూ వుంటుంది. ఓ పశువుల కాపరి తన పశువులను మేపుతూ ఈ ప్రాంతానికి చేరుకుంటాడు. ఇక్కడ గల పుట్టలో తన ఆవులు పాలను ధారగా కురిపించడం చూస్తాడు. ఆ పుట్టలో పాము వుందని భావించి పుట్టపై మంటపెడతాడు. ఆ క్షణం నుంచి తన శరీరం కాలుతున్నట్టుగా అనిపిస్తూ ఉండటంతో ఆ పశువుల కాపరి బాధతో విలవిలలాడి పోసాగాడు.

విషయం తెలుసుకున్న గ్రామస్తులు పుట్టపై మంటను తొలగించడంతో పశువుల కాపరి బతికి బయటపడతాడు. ఆ పుట్ట లోపల కృష్ణుడి విగ్రహం వుండటం చూసి వాళ్లు దానిని బయటికి తీయించగా అప్పటికే అది చాలావరకూ కాలిపోతుంది. జరిగిన దానికి అందరూ బాధపడతారు ... ఆ ప్రతిమను ప్రతిష్ఠించాలో .. మానుకోవాలో తెలియక ఆలోచనలో పడతారు. ఆ రాత్రి ఓ భక్తుడికి కలలో స్వామి కనిపించి, అక్కడికి సమీపంలో గల గ్రామం ( కాకరపర్తి)లో తాను ఉన్నట్టుగా చెప్పాడట.

ఆ ఊళ్లోని ఓ రైతు ఇంట్లో గల కాకరపాదు మొదట్లో తవ్వి చూస్తే తన విగ్రహం లభిస్తుందనీ, ఆ ప్రతిమను ప్రతిష్ఠించమని ఆదేశిస్తాడు. స్వామి చెప్పిన ఆనవాళ్లను బట్టి అలాగే చేయగా అక్కడ కృష్ణుడి విగ్రహం బయటపడుతుంది. కృష్ణుడి శరీర ఛాయలానే ఈ విగ్రహం నీల వర్ణంలో వుండటం అరుదైన విశేషంగా చెప్పబడుతోంది. ఈ కారణంగానే ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తుంటారు.


More Bhakti News