సంపదలను ప్రసాదించే గురువు

బలమైన విశ్వాసం భగవంతుడి మనసును సైతం కరిగిస్తుంది. ఆయన పరిగెత్తుకుని వచ్చి వరాలను ప్రసాదించేలా చేస్తుంది. అలాంటి నమ్మకం గురువుపై ఉంచితే ఆయన కూడా అదే స్థాయిలో తన భక్తులను కరుణిస్తాడు ... వాళ్లకు లేమి అనేది లేకుండా చేస్తాడు. ఆది శంకరాచార్యులు ... రామానుజాచార్యులు ... రాఘవేంద్రస్వామి ... దత్తాత్రేయుడు ... శ్రీ పాద శ్రీవల్లభుడు ... శ్రీ నృసింహ సరస్వతి ... మాణిక్యప్రభు .. శిరిడీ సాయిబాబా ... వంటి గురువులంతా కూడా ఈ తీరుగా తమ భక్తులను అనుగ్రహించినవారే.

తమని అనునిత్యం ఆరాధిస్తోన్న వారు పేదరికంతో సతమతమై పోతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా వారికి సంపదలను ప్రసాదించారు. అలాంటి సంఘటన ఒకటి మనకి శ్రీ అక్కల్ కోట మహారాజ్ జీవితంలోను కనిపిస్తుంది. అక్కల్ కోట సమీప గ్రామానికి చెందిన ఓ బ్రాహ్మణుడు పేదరికంతో బాధపడసాగాడు. పేదరికంతో కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో తెలియక ఆయన సతమతమై పోసాగాడు.

భగవంతుడిపై భారం వేసి పేదరికం నుంచి బయటపడటానికి ఆయన కొన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. దాంతో భార్యా బిడ్డలు పస్తులు వుండటం చూస్తూ బతకడం కన్నా చనిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నాడు. అయితే చివరిసారిగా అక్కల్ కోట మహారాజ్ దర్శనం చేసుకుని, ఆ తరువాత తనువుచాలించాలని అనుకున్నాడు. వెంటనే అక్కల్ కోటకు ప్రయాణమై స్వామివారి ఆశ్రమానికి చేరుకున్నాడు.

ఆ రోజున స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంది. అంతమందిలోను స్వామి ఆ పేద బ్రాహ్మణుడిని చూసి చిరుమంద హాసం చేశాడు. ఆయన్ని దగ్గరికి పిలిచి తన చేతిలోని ప్రసాదాన్ని అందించాడు. భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని అర్థం చేసుకుని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నించమని చెబుతాడు. ఆయన ఇంటి ప్రాంగణంలో గల చెట్టుపాదులో తవ్వి అక్కడ ఏది లభిస్తే దానితో జీవించమని అంటాడు.

ఆ పేద బ్రాహ్మణుడు ఆనంద బాష్పాలతో స్వామివారి పాదాలను కడిగి ఇంటికి చేరుకుంటాడు. ఇంటి ప్రాంగణంలో గల చెట్టు పాదులో తవ్వగా, వారి పూర్వీకులు దాచిన సంపద లభిస్తుంది. స్వామివారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్న ఆ బ్రాహ్మణుడు, భార్యా బిడ్డలతో కలిసి ఆ సంపదను అనుభవిస్తూ ఆనందకరమైన జీవితాన్ని కొనసాగించాడు.


More Bhakti News