అరుదైన ఆలయంలో అనుగ్రహించే దైవం

దేవతలకి ఎలాంటి కష్టం వచ్చినా వాళ్లంతా కలిసి ముందుగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి పరిస్థితిని వివరిస్తూ వుంటారనే విషయం ఆధ్యాత్మిక గ్రంధాల అధ్యయనం వలన తెలుస్తుంటుంది. అప్పుడు బ్రాహ్మదేవుడు ఆ సమస్య తీవ్రతను బట్టి శివ కేశవులలో ఎవరినో ఒకరిని ఆశ్రయించమని చెబుతుంటాడు. ఎప్పుడూ సహనంతో కనిపిస్తూ అడిగిన వారికి వరాలను ఇస్తూ వెళ్లే బ్రహ్మదేవుడికి ఆలయాలు లేకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వుంటుంది.

బ్రహ్మదేవుడికి ఆలయాలు లేకపోవడానికి కారణాలుగా కొన్ని కథనాలు వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మదేవుడి ఆలయం మనకి రాజస్థాన్ లోని 'ఆసోతరా' లో కనిపిస్తుంది. బ్రహ్మదేవుడికి గల అరుదైన ఆలయాల్లో ఒకటిగా ఈ ఆలయం దర్శనమిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో అందమైన నగిషీలతో తీర్చిదిద్దిన ఈ ఆలయంలో బ్రహ్మదేవుడి పాలరాతి మూర్తి ... ఆ పక్కనే సరస్వతీదేవి కొలువుదీరి కనిపిస్తారు. ఈ ఆలయం గురించిన చరిత్ర తెలుసుకోవాలని అనుకోగానే ముందుగా 'ఖేతేశ్వర్' పేరు వినిపిస్తుంది.

ఖేతేశ్వర్ మహా భక్తుడు ... నిరంతరం భగవంతుడి ధ్యానం ... భజనలే ఆయన జీవితం. అలాంటి ఖేతేశ్వర్ అత్యంత భక్తి శ్రద్ధలతో బ్రహ్మదేవుడి ఆలయాన్ని నిర్మించాడు. ఇదే ప్రాంగణంలో ఖేతేశ్వర్ సమాధి మందిరం కూడా దర్శనమిస్తూ వుంటుంది. ఇక్కడి బ్రహ్మదేవుడును అంకిత భావంతో ఆరాధిస్తే, ఆశించిన ఫలితాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి యేటా వైశాఖ మాసంలో ఇక్కడ జరిగే మేళాకు అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు ... బ్రహ్మదేవుడిని పూజిస్తూ పునీతులవుతుంటారు.


More Bhakti News