ప్రశాంతతను ప్రసాదించే సాయి క్షేత్రం

ప్రశాంతత అన్ని వ్యాధులకు ఔషధంలా పనిచేస్తుంది. అందని వాటిని ఆశించడం ... దాని కోసం పరుగులు తీయడం ... అది లభిస్తుందా లేదా అనే మానసిక ఒత్తిడికి లోనుకావడం జరుగుతుంది. అనుకున్నది సాధించలేకపోయినప్పుడు నిరాశా నిస్పృహలు ఏర్పడుతుంటాయి. అదే విషయాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం వలన మానసిక ప్రశాంతత లోపించి ఆరోగ్యం దెబ్బతింటుంది.

ఇక మరికొందరి విషయంలో హఠాత్తుగా ఎదురయ్యే చిక్కులు ప్రశాంతత లేకుండా చేస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లోనే ఆలయాలలో కాసేపు హాయిగా కూర్చోవాలనిపిస్తూ వుంటుంది. అదే సాయిబాబా ఆలయమైతే ఆయన కళ్లలోకి చూస్తూ కష్టాలను మరిచిపోవచ్చు. ఆయన చిరుమందహాసాన్ని తిలకిస్తూ ఉపశమనం పొందవచ్చు. అలాంటి సాయి మందిరాలలో ఒకటి రంగారెడ్డి జిల్లా 'గుర్రంగూడ'లో కనిపిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం ప్రశాంతతకు ప్రతీకగా కనిపిస్తూ వుంటుంది.

ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ ఆలయంలో ఆధ్యాత్మిక ప్రసంగాలకు అనుకూలమైన ప్రదేశం వుంది. విశాలమైన మంటపంలోగల వేదికపై సాయి విగ్రహం దర్శనమిస్తూ వుంటుంది. సాయికి వృద్ధాప్యం వచ్చాక ఎలా ఉండేవాడో అచ్చు ఈ విగ్రహం అలాగే కనిపిస్తూ వుంటుంది. సాయిబాబాకి రెండు వైపులా గణపతి ... దత్తాత్రేయస్వామి ప్రతిమలు వుంటాయి. వేదికపై గల సాయిబాబా మూర్తి అనురాగామృతాన్ని కురిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది.

శిరిడీలో మాదిరిగానే అభిషేకాలు ... అలంకారాలు ... సేవలు నిర్వహిస్తుంటారు. మంటపంలో ఇరువైపులా సాయి జీవితానికి సంబంధించిన ముఖ్య ఘట్టాలు వర్ణ చిత్రాలుగా దర్శనమిస్తూ వుంటాయి. ధ్యానం ... పారాయణాలు చేసుకోవడానికి ఈ ఆలయం అనుకూలంగా వుంటుంది. అందువలన ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రశాంతతాయే ప్రసాదంగా లభిస్తుందని చెప్పవచ్చు.


More Bhakti News