భర్త ప్రాణాల కోసమే భవానీదేవి దీక్ష

సత్యవంతుడు ఎప్పటిలానే కట్టెల కోసం ఆశ్రమం నుంచి అడవికి బయలుదేరుతాడు. ఆ రోజున ఆయన ఆయువు తీరనుందనే విషయం మహా పతివ్రత అయిన సావిత్రికి ముందుగానే తెలుస్తుంది. అందువల్లనే తన పసుపు కుంకుమలను కాపాడమని అప్పటికి మూడు రోజులుగా భవానీదేవి దీక్షను స్వీకరించి వ్రతం చేస్తూ వుంటుంది. ఆ రోజున అడవికి వెళ్లవద్దని చెప్పినా భర్త వినిపించుకోకపోవడంతో, ఆయనతో పాటు ఆమె కూడా అడవికి వెళుతుంది. విష కీటకాలు తన భర్త వైపు రాకుండా ఆమె ఎంతో జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ వుంటుంది.

చెట్టుకొమ్మను కొట్టడానికి ప్రయత్నించిన సత్యవంతుడు, తనకి ఏదో అయిపోతుందంటూ ఒక్కసారిగా కూలబడిపోతాడు. ఆమె కంగారుగా సత్యవంతుడి దగ్గర కూర్చుని ఆయనకి ధైర్యం చెబుతుండగానే ఆయన ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతాయి. దాంతో సావిత్రి కన్నీళ్ల పర్యంతవౌతుంది. భవనీదేవికి తాను చేసిన పూజలను గురించి ప్రస్తావిస్తూ ఆవేదన చెందుతుంది. అదే సమయంలో యమభటులు అక్కడికి వస్తారు. సత్యవంతుడి ప్రాణాలు తీసుకు వెళ్లడానికి వచ్చినట్టు చెబుతారు.

తాను జీవించి వుండగా తన భర్త ప్రాణాలు తీసుకు వెళ్లనీయనని చెబుతుంది సావిత్రి. తాము యమధర్మరాజు ఆదేశాన్ని తప్పక పాటించవలసి ఉంటుందనీ, తమ పనికి అడ్డు చెప్పవద్దంటూ వాళ్లు అడుగు ముందుకు వేస్తారు. అంతే యమభటులను నిలువెత్తు మంటలు అడ్డుకుంటాయి. ఎన్నివిధాలుగా ప్రయత్నించినా ఆ మంటలను దాటుకుని వాళ్లు సత్యవంతుడి దగ్గరికి రాలేకపోతారు. సావిత్రి పాతివ్రత్య మహిమ ... ఆమె చేపట్టిన భవానీదేవి దీక్ష తమ విధి నిర్వహణకు అడ్డుపడుతున్నాయని భావించిన యమభటులు చేసేది లేక వెనుదిరుగుతారు.


More Bhakti News