సీతారాములు దర్శించిన అంతర్వేది

నరసింహస్వామి వెలసిన పుణ్య క్షేత్రాలలో మహా విశిష్టమైనదిగా చెప్పుకోదగినది అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం. ఇది తూర్పు గోదావరి జిల్లాలో నదీ (వశిష్ఠ గోదావరి)సాగర సంగమ తీరాన వెలసిన పరమ పవిత్రమైన పుణ్య క్షేత్రం. ఇక్కడ సముద్రంలో గోదావరి అంతర్వేదికగా వుంటుంది కనుక దీనికి 'అంతర్వేది' అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక ఈ ప్రాంతం 'సఖినేటి పల్లి' మండలం పరిధిలోకి వస్తుంది. త్రేతాయుగంలో శ్రీ రాముడు సీతా సమేతుడై ఇక్కడి స్వామివారి దర్శనానికి వస్తూ సఖినేటి పల్లి లో ఆగాడట. అప్పటికే బాగా పోద్దుపోవడంతో, ''సఖీ! నేటికి ఈ పల్లెనే మన విశ్రాంతి ప్రదేశం'' అని పలికాడట. ఈ కారణంగానే ఈ ప్రాంతానికి సఖినేటి పల్లి' అనే పేరు వచ్చిందని అంటూ వుంటారు.

ఈ దివ్య క్షేత్రానికి సంబంధించిన స్థల పురాణం పరిశీలిస్తే ... కృతయుగంలో తన గొప్పతనాన్ని అంగీకరించని వశిష్ట మహర్షి పై విశ్వామిత్రుడు ద్వేషాన్ని పెంచుకున్నాడు. హిరణ్యాక్షుడి కుమారుడైన రక్త లోచనుడుతో, వశిష్ట మహర్షి 100 మంది కొడుకులను చంపించాడు. పుత్ర శోకాన్ని భరించలేక పోయిన వశిష్టుడు నరసింహ స్వామిని ప్రార్ధించాడు. దాంతో దుష్ట శిక్షణ చేయడానికి నరసింహ స్వామి ప్రత్యక్ష మయ్యాడు. రక్త లోచనుడు శరీరం నుంచి రక్తం చిందితే, ఆ రక్తం నుంచి మరి కొందరు రాక్షసులు పుట్టుకొస్తారని తెలిసిన నరసింహ స్వామి, తన సోదరి అయిన 'అశ్వ రూడాంబ' ను రప్పించాడు. విషయాన్ని గ్రహించిన ఆమె రక్త లోచనుడి రక్తం కింద పడకుండా యుద్ధరంగమంతా తన నాలుకను పరిచింది. అప్పుడు ఆ రాక్షసుడిని నరసింహ స్వామి సంహరించాడు. ఆ తరువాత వశిష్ట మహర్షి కోరిక మేరకు నరసింహ స్వామి లక్ష్మీ సమేతుడై అక్కడే వెలిశాడు. ఈ అశ్వ రూడాంబయే ... 'గుర్రాలక్కమ్మ' పేరుతో ఇప్పటికీ పూజలందుకుంటూ వుంది.

ఇక్కడి స్వామివారికి మొదటి సారిగా కేశవదాసు అనే పశువుల కాపరి చిన్నపాటి మందిరాన్ని ఏర్పాటు చేయగా, అది ప్రసిద్ధి చెందుతూ వచ్చింది. కాలక్రమంలో మొగల్తూరు రాజైన శ్రీ రాజా బహద్దూర్ వారి ఆధ్వర్యంలో ... దాతల సహాయ సహకారాలతో అభివృద్ధి చెందుతూ వచ్చింది. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో పది రోజుల పాటు స్వామివారికి కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. 'భీష్మ ఏకాదశి' పర్వదినాన జరిగే ఈ వేడుకలను తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. మాఘ మాసంలో కొన్ని రోజులపాటు సూర్యాస్తమయ సమయంలో సూర్య కిరణాలు స్వామివారి పాదాలను తాకుతూ ఉండటాన్ని విశేషంగా భావిస్తుంటారు. ఇక ఈ క్షేత్రంలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి ... భూదేవి ... రాజ్యలక్ష్మీ తాయారు ... సంతాన వేణుగోపాల స్వామి ఆలయాలు భక్తి భావ పరిమళాలను వెదజల్లుతూ వుంటాయి.


More Bhakti News