సంతాన రంగనాథస్వామి క్షేత్రం

అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల జాబితాలో శ్రీరంగనాథస్వామి ఆలయం ముందువరుసలో కనిపిస్తుంది. ఇక్కడి 'తొండపాడు' క్షేత్రంలో ఈ ఆలయం అలరారుతోంది విజయనగర రాజుల కాలంలో వాళ్ల గుర్తింపును పొంది ... వాళ్లచే అభివృద్ధికి నోచుకున్న ఆలయాల్లో ఈ ఆలయం ఒకటిగా కనిపిస్తుంది.

సంతానం లేని భక్తులు ఇక్కడి స్వామిని సేవించి, సంతానాన్ని పొందిన దాఖలాలు ఎన్నో కనిపిస్తాయి. ఈ మహిమను గుర్తించిన కారణంగానే విజయనగర రాజులు ... ఆనాటి ప్రజలు స్వామివారిని తమ ఇలవేల్పుగా భావించి పూజించారని అంటారు. మాణిక్యాల్లాంటి బిడ్డలను ప్రసాదిస్తాడు కనుకనే ఇక్కడి స్వామిని 'మాణిక్య రంగనాథుడు' పేరుతో కొలుస్తుంటారు.

ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఈ ప్రాంతంలో రంగనాథస్వామి పేరుగల వ్యక్తులు ఎక్కువమంది కనిపిస్తుంటారు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం ... అద్భుతంగా తీర్చిదిద్దబడిన గాలిగోపురంతో భక్తులకు ఆహ్వానం పలుకుతూ వుంటుంది. ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లబడుతూ వుంటాయి.

గర్భాలయంలో శయన రంగనాథస్వామి రూపం మనోహరంగా దర్శనమిస్తూ వుంటుంది. కొండంత స్వామి కన్నుల నిండుగగా ... పండుగలా కనిపిస్తూ వుంటాడు. స్వామి దర్శనం లభించగానే మనసంతా మధురభక్తి రాజ్యమేలుతుంది. పర్వదినాల్లో స్వామివారిని దర్శించి ఆయన ఆశీస్సులు అందుకుని తరించే భక్తులు అధిక సంఖ్యలో వుంటారు.


More Bhakti News